తమ సమస్యలు పరిష్కరించాలని, విపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండు చేస్తూ వీఆర్‌ఏలు (గ్రామ రెవెన్యూ సహాయకులు) చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ‘చలో విజయవాడ’లో భాగంగా బుధవారమే పలు జిల్లాల నుంచి వీఆర్‌ఏలు బయల్దేరగా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. అయినా, గురువారం ఉదయానికల్లా భారీగా ధర్నా స్థలికి చేరుకున్నారు. మండుటెండలో నాయకుల ప్రసంగాలు విన్న వారు.. సమస్యల పరిష్కారానికి నేరుగా ముఖ్యమంత్రినే కలుద్దామంటూ నినదించారు. ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం నాయకులు ఒక్కసారిగా ‘చలో సీఎం క్యాంపు కార్యాలయం’, ‘చలో అసెంబ్లీ’కి పిలుపునిచ్చారు. వెంటనే వీఆర్‌ఏలు రోడ్డుపైకి వచ్చారు.
వీరంతా శాసనసభకు వెళ్తారన్న అంచనాలతో ఉన్న పోలీసులు అప్పటికే వందల సంఖ్యలో మోహరించారు. అలంకార్ కూడలి వైపు వెళ్లే మార్గాలన్నింటినీ మూసివేసి, నిరసనకారులను అడ్డుకున్నారు. ఓ దశలో వారిని నిలవరించడం పోలీసులకు కష్టమైంది. సంఘం నాయకులను అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకునే క్రమంలో కొందరు వీఆర్‌ఏలపై కర్కశంగా వ్యవహరించి, గాయపరిచారు. మెడలను గట్టిగా నొక్కి, బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారని వీఆర్‌ఏలు ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన 50ఏళ్లు పైబడిన ఓ వీఆర్‌ఏ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన కాలికి, కంటికి గాయాలయ్యాయి. మొత్తంగా 50 మందికిపైగా గాయపడ్డట్లు వీఆర్‌ఏలు తెలిపారు.
- వీఆర్‌ఏలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గర్హనీయమని ఎమ్మెల్సీలు ఐ.వెంకటేశ్వరరావు, సాబ్జీ అన్నారు. ఉదయం ధర్నాచౌక్‌లో వారు మాట్లాడుతూ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ని కలుద్దామని ప్రయత్నించినా, సమయం ఇవ్వకపోవడాన్ని ఖండించారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.గఫూర్ మాట్లాడుతూ డీఏల విషయంలో వీఆర్‌ఏలకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం స్పందించాలని కోరారు.
ఇదీ చదవండి
Inam Lands in AP: ‘ఇనాం’ భూముల ద్వారా ఆదాయంపై ప్రభుత్వం దృష్టి..?