ఒక్కమాటా పలకకుండా అనేక భావాలను వ్యక్తపరిచే గొప్ప కళ నృత్యం. జానపదం, శాస్త్రీయం, పాశ్చాత్య, ఇలా నృత్యరీతులు ఏవైనా.. అంతిమంగా వాటి లక్ష్యం మనసుని రంజింపజేయడమే. సమాజాన్ని చైతన్యపరిచే నృత్య కళలో అద్భుత ప్రతిభ కనబరిచి అందరినీ ఆకట్టుకుంటోంది విజయవాడకు చెందిన కృష్ణవేణి. నృత్యంతోపాటు చిత్రలేఖనంలోనూ ప్రావీణ్యాన్ని చాటుతూ అనేక అవార్డులు సొంతం చేసుకుంది. తాజాగా.. నాట్య సింధు పురస్కారం అందుకుంది.
కృష్ణవేణి.. కూచిపూడి నాట్యాన్ని దేశంలో పలు ప్రాంతాల్లో ప్రదర్శించి అనేక సత్కారాలు, అవార్డులు పొందింది. పిన్న వయసులోనే సప్తగిరి, ఎస్వీబీసీ (SVBC) ఛానల్స్‌లో ప్రదర్శనలు ఇచ్చిన ఘనతను సొంతం చేసుకుంది. ఇంద్రకీలాద్రిపై అనేకసార్లు ప్రదర్శనలు ఇచ్చింది. మొత్తం వెయ్యికి పైగా ప్రదర్శనలు తన ఖాతాలో జమచేసుకుంది.
చిత్రలేఖనంలోనూ కృష్ణవేణి తనకంటూ ప్రత్యేకత ఏర్పరచుకుంది. మనసుకు నచ్చితే చాలు ఎలాంటి చిత్రాన్నైనా చూసిన వెంటనే గీయటానికి సంకల్పించుకుంది. గురువు సునీల్ కుమార్ శిక్షణలో చిత్రలేఖన పోటీల్లో పాల్గొని.. ఎన్నో బహుమతులు, అవార్డులు దక్కించుకుంది. తెలుగు కళావాహిని నుంచి నాట్యసింధు బిరుదు, రాజాజీ ఆర్ట్ ఫౌండేషన్ వారి ఆంధ్రశ్రీ బిరుదు కృష్ణవేణి దక్కించుకుంది.
ఆరేళ్ల నుంచే కూచిపూడి నేర్చుకుంటున్న కృష్ణవేణి.. నిరంతర సాధనతో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తోంది. రోజూ ఉదయం నాలుగున్నర నుంచి 7 గంటల వరకు నాట్య సాధన, సాయంత్రం ఓ గంట చిత్రలేఖనం శిక్షణ.. ఇలా చదువుతోపాటు కళలకు సమప్రాధాన్యం ఇస్తూ.. ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తోంది.
ఇదీ చదవండి :
''ఆర్ఆర్ఆర్'లో ఆ సీక్వెన్స్.. ప్రేక్షకులు ఊపిరి తీసుకోవడం మర్చిపోతారు'