ఆక్సిజన్ కోసం కరోనా రోగుల బాధలను కళ్లారా చూసిన విజయవాడ గురుద్వారా శ్రీ గురుసింగ్ సభ.. వారికి తమవంతు సహకారం అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చింది. గురునానక్‌కాలనీలోని గురుద్వారా వేదికగా.. ఐదు లీటర్ల సామర్థ్యమున్న కాన్సంట్రేటర్లను అవసరమైన వారికి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. నగరంలో హోంఐసొలేషన్‌లో ఉంటూ.. ఆక్సిజన్ స్థాయి 85 నుంచి 95 మధ్య ఉండే వారికి వీటిని అందజేస్తున్నారు. ఒక్కో యంత్రం ధర రూ. 75 వేల వరకు ఉండగా.. తొలిదశలో 25 కాన్సంట్రేటర్లను గురుద్వారా ప్రతినిధులు కొనుగోలు చేశారు. తొలి ఐదు రోజులు ఎలాంటి రుసుము తీసుకోకుండా పూర్తి ఉచితంగా సమకూరుస్తున్నారు. అనంతరం రెండు రోజులపాటు కరోనా బాధితుల వద్ద ఉంచితే రోజుకు రూ. 500 వరకు వసూలు చేస్తున్నారు. ఒక్కో వ్యక్తికి వారంపాటు వీటిని ఉచితంగా, నామమాత్రపు రుసుముతో అందిస్తున్నారు.
ఇదీ చదవండి: '100% వ్యాక్సినేషన్ జరిగిన గ్రామానికి రూ.10లక్షలు'
సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ. 50 వేలు తీసుకుని.. కాన్సంట్రేటర్లను తిరిగి ఇచ్చేసిన వారికి ఆ మొత్తాన్ని మరలా చెల్లించేలా గురుద్వారా ప్రతినిధులు ఏర్పాట్లు చేశారు. తమను పలువురు ఫోన్లలో, భౌతికంగా సంప్రదించి కాన్సంట్రేటర్లను తీసుకెళ్తున్నట్లు వారు చెప్పారు. శక్తి మేరకు మరికొన్నింటిని తెప్పించి అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కరోనా కష్టకాలంలో దీన్ని దేవుని సేవగా భావిస్తున్నట్లు సభ కార్యదర్శి హర్‌మహేంద్రసింగ్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: