దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ మొదటిరోజు శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా, రెండవ రోజు శ్రీ బాలా త్రిపురసుందరిదేవిగా, మూడో రోజు శ్రీగాయత్రి దేవిగా, నాలుగోరోజు అన్నపూర్ణా దేవిగా,ఐదో రోజు లలితా త్రిముసుందరిగా ,ఆరో రోజు శ్రీ మహా లక్ష్మీ దేవిగా, ఏడో రోజు సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. ఈ రోజు శ్రీ దుర్గాదేవిగా కొలువైంది.
శ్రీ దుర్గా దేవి విశిష్టత...
దుర్గాదేవిని శివుడిలోని సగభాగం, శక్తి స్వరూపిణిగా కొలుస్తారు. విశ్వాన్ని రక్షించడానికి తన శక్తులను త్రిమూర్తులకు దుర్గాదేవి ప్రసాదించింది. దేవి చేతిలోని త్రిశూలం మానవుల్లోని సత్వ, రజో, తమో గుణాలకు సంకేతం. సత్వ గుణం- ఆదర్శమైన గుణం, నిష్కల్మషమైన ఆలోచనలు కలిగి ఉంటుంది. రజో గుణం- కామ, మోహ, కోరికల కలయిక. దీని వల్ల మానవుడు కర్మలతో బంధించబడతాడు. తమో గుణం- అజ్ఞానంతో కుడుకుని ఉంటుంది.ఈ గుణాల మధ్య సమతూకం పాటించినప్పుడే శాంతి, సంతోషం కలుగుతాయి.
ఎనిమిదో రోజు నైవేద్యం
దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో రూపం ఉన్నట్లే... నైవేద్యం కూడా ప్రతీరోజు ప్రత్యేకంగా ఉంటుంది. అమ్మవారికి ఎనిమిదో రోజు అంటే.. ఆశ్వయుజ అష్టమి- అంటే.. దుర్గాష్టమి రోజున అమ్మవారికి అత్యంత ప్రియమైన మినుములతో తయారు చేసిన చిట్టిగారెలు సమర్పించాలి.. ఇలా చేస్తే అమ్మవారు కటాక్షిస్తుందని భక్తుల నమ్మకం.