విజయవాడ స్వరాజ్యమైదానంలో ఏర్పాటుచేసిన పుస్తక ప్రదర్శనకు ప్రజల ఆదరణ కొనసాగుతోంది. పేరొందిన తయారీ, విక్రయ సంస్థలు స్టాళ్లు ఏర్పాటు చేసి, వేలాది పుస్తకాలను ప్రదర్శిస్తున్నాయి. సంక్రాంతి సెలవుల రాకతో పిల్లలను తీసుకుని పెద్దలు పుస్తక ప్రదర్శనకు తరలివస్తున్నారు. పిల్లలు, పెద్దలు తమకు నచ్చిన పుస్తకాలను కొంటున్నారు.
'ఇక్కడకు రావడం చాలా ఆనందంగా ఉంది. చిన్న గ్రంథాలయాల్లో చదివాం కానీ.. ఇన్ని పుస్తకాలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మేం చాలా బుక్స్ కొనుక్కున్నాం.' - విద్యార్థిని
చిన్న పిల్లలకు చిత్రలేఖనం పై ఆసక్తి పెంచేలా ప్రత్యేక స్టాళ్లు ఇక్కడ కొలువుదీరాయి. పేపర్లను విభిన్నంగా కత్తిరించి, వాటిని రంగులతో నింపేలా చిన్నారులను నిర్వాహకులు ప్రోత్సహిస్తున్నారు. బాగా బొమ్మలు వేసిన వారికి బహుమతులు ఇచ్చి ఉత్సాహపరుస్తున్నారు. తమ కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం పట్ల చిన్నారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
'బయట బుక్స్ చాలా ఎక్కువ రేటు ఉంటాయి. ఇక్కడ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఎక్కడా దొరకని పుస్తకాలు కూడా ఇక్కడ ఉన్నాయి.' - విద్యార్థిని
మార్కెట్లో ఎక్కడా దొరకని, పేరొందిన రచయితల పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాంటి పుస్తకాలను 10 నుంచి 30 శాతం రాయితీపై పబ్లిషర్లు అందిస్తున్నారు. నవలలు, కవితలు, సాహిత్య పుస్తకాలు కొనేందుకు యువత ఎక్కువ ఆసక్తి చూపుతోంది.
కేవలం పుస్తకాల విక్రయాలకే ప్రదర్శనను పరిమితం చేయకుండా... విభిన్న రకాల మార్కెటింగ్ స్టాళ్లనూ నిర్వాహకులు ఏర్పాటుచేశారు. డ్వాక్రా మహిళలు తయారు చేసిన వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. వివిధ రెస్టారెంట్ల ఆధ్వర్యాన సందర్శకులకు పసందైన వంటకాలను రుచి చూపుతున్నారు.
ఇదీ చదవండి;