విజయవాడ నగరవాసులతో పాటు జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారుల కష్టాలను తీర్చే బెంజిసర్కిల్ పైవంతెన అందుబాటులోకి వచ్చింది. గుంటూరు వైపు నుంచి విశాఖ వెళ్లే మార్గంలో రెండో పైవంతెనను జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ పూర్తిచేసింది. దీంతో ఏళ్లతరబడి ట్రాఫిక్ ఇక్కట్లు ఎదుర్కొంటున్న వాహనదారులకు ఉపశమనం లభించింది. ప్రయోగాత్మంగా వాహనాలకు అనుమతించడంతో కొత్త వంతెన పై వాహనాలు ఎలాంటి అడ్డంకులు లేకుండా రయ్..రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి.
ఇప్పటికే విశాఖ నుంచి గుంటూరు వైపు వెళ్లే మార్గంలో వంతెన అందుబాటులోకి రాగా...ఇప్పుడు రెండోవైపు వంతెన పైనుంచి ప్రయోగాత్మకంగా వాహనాలకు అనుమతించారు. నగరంలో కీలకమైన కూడలి కావడంతో గతంలో ఈమార్గంలో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయేవి. ట్రాఫిక్ ఇబ్బందులతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ప్రయాణం సాఫీగా సాగిపోతుండటంతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రెండో పైవంతెనను స్థానిక ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దెరామ్మోహన్‌తో కలిసి పరిశీలించారు. వంతెనపై నడుచుకుంటూ వెళ్తూ...గుత్తేదారుసంస్థ ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. త్వరలోనే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో లాంఛనంగా బెంజిసర్కిల్ పైవంతెన ప్రారంభిస్తామని కేశినేనినాని తెలిపారు. రేయింబవళ్లు కార్మికులు పనులు చేయడం ప్రిఫ్యాబ్రికేషన్ పనులు సకాలంలో చేయడంతో... అనుకున్నదానికన్నా 6నెలలు ముందుగానే పైవంతెన పనులు పూర్తిచేసినట్లు గుత్తేదారు సంస్థ తెలిపింది.
ఇదీ చదవండి: