కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ)... పాల రైతులకు రెండో విడత కింద రూ.13 కోట్ల బోనస్ ప్రకటించింది. పాల ఫ్యాక్టరీలో జరిగిన పాలకవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పాడి రైతులకు బోనస్ చెల్లింపుతోపాటు దేశంలోనే అత్యధిక ధర చెల్లించేది కృష్ణా మిల్క్ యూనియనేనని ఛైర్మన్ చలసాని ఆంజనేయులు అన్నారు. పదేళ్ల కాలంలో సుమారు 500 కోట్ల రూపాయలు బోనస్‌గా రైతులకు అందజేశామన్నారు. సంక్షేమ పథకాల అమలకు లీటరుకు రెండు రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. రైతులు, వినియోగదారులు తమకు రెండు కళ్లని, పాల ఉత్పత్తులు అందించే క్రమంలో 54 రకాల పరీక్షలు చేసి వినియోగదారులకు నాణ్యమైన పాల ఉత్పత్తులు అందిస్తుందన్నారు.
కృష్ణా మిల్క్ యూనియన్ పాలు, పాల ఉత్పత్తులను పోలిన విజయ తెలంగాణా బ్రాండ్‌తో వినియోగదారులు అయోమయానికి, అపోహకు లోను కావద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గుజరాత్‌కు చెందిన అమూల్ సంస్థకు అందిస్తున్న సహాయ సహకారాలను కృష్ణా మిల్క్ యూనియన్‌కు అందిస్తే రైతులకు, వినియోగదారులకు మరింత సేవలందిస్తామని చెప్పారు. పాల ఉత్పత్తిని మరింత పెంచేందుకు శ్రీవత్స పేరిట దూడల పెంపక కేంద్రాన్ని ఏర్పాటు చేసి సుమారు 100 మేలుజాతి లేగదూడలను పెంచి రైతులకు అందిస్తామన్నారు. ఇందుకు 50 లక్షల రూపాయలు కేటాయించామని తెలిపారు. పాలక మండలి సమావేశంలో డెయిరీ ఎండీ కొల్లి ఈశ్వరబాబు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: