ఈ ఆర్థిక సంవత్సరం తొలి విడత బోనస్‌ను కృష్ణా మిల్క్ యూనియన్(krishna Milk Union) ప్రకటించింది. లక్షన్నర పాడిరైతు కుటుంబాల సంస్థగా ఉన్న విజయ డెయిరీ(vijaya dairy).. ఏప్రిల్ నుంచి జులై నెలలకుగానూ రూ. 16 కోట్లు బోనస్‌గా అందించేందుకు పాలకవర్గం నిర్ణయించింది. కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు అధ్యక్షతన.. పాలకమండలి సమావేశం జరిగింది. దేశంలోనే రైతులకు అత్యధిక పాల సేకరణ ధరను యూనియన్ అందిస్తోందని ఛైర్మన్ ఆంజనేయులు చెలిపారు.
మెరుగైన ధర చెల్లిస్తాం..
కరోనా సంక్షోభ పరిస్థితుల్లో రైతు కుటుంబాలకు అండగా నిలిచేందుకు 2021 మే నెలలో కేజీ ఫ్యాట్‌కి రూ.50/- పెంచే నిర్ణయాన్ని సాహసోపేతంగా తీసుకున్నామని తెలిపారు. ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.35 కోట్లు భారం పడిందన్నారు. ప్రోత్సాహక ధర క్రమం తప్పకుండా చెల్లించడమే కాకుండా ఎన్నో రైతు సంక్షేమ కార్యక్రమాలను నిబద్ధతతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఉన్న 6 కోట్ల లీటర్లు పాల సేకరణను.. 2020-21 నాటికి 8 కోట్ల లీటర్లకు పెంచినట్లు చెప్పారు. భవిష్యత్తులో మరింత మెరుగైన ధర పాడి రైతులకు(paddy farmers) ఇచ్చి వారి కుటుంబాల అభివృద్ధికి కృష్ణా మిల్క్ యూనియన్ కృషి చేస్తుందన్నారు.
రూ. 1100 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా..
2017-18లో రూ. 662 కోట్ల టర్నోవర్(turnover) ఉండగా.. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 915 కోట్లుకు పెంచడం ద్వారా 38 శాతం వృద్ధి సాధించినట్లు తెలిపారు. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో పాల సేకరణలో 8 శాతం వృద్ది, పాలు దాని అనుబంధ ఉత్పత్తుల అమ్మకంలో 22 శాతం వృద్ధిని సాధించామన్నారు. మొత్తం టర్నోవర్‌లో 15 శాతం వృద్ధి నమోదు చేసినట్లు వివరించారు. 2021-22 సంవత్సరానికి రూ. 1100 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నట్లు ఛైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. సమావేశంలో మేనేజింగ్ డైరెక్టర్ కొల్లి ఈశ్వర బాబు, ఇతర పాలకవర్గ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి..