విజయవాడ చిట్టినగర్‌కు చెందిన విధివంచిత కుటుంబానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆర్థిక సాయం అందించారు. 'ఈటీవీ భారత్'లో 'ఆమె అతనికి వెన్ను...ఆ కుటుంబానికి దన్ను' శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ఉపరాష్ట్రపతి కార్యాలయం సిబ్బంది ద్వారా బాధిత కుటుంబం చింతా కుమారి, శివప్రసాద్‌లకు చెందిన పూర్తి వివరాలను సేకరించారు. బాధిత కుటుంబంతో ఫోన్లో మాట్లాడిన కార్యాలయ సిబ్బంది ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య తక్షణ సాయంగా తన జీతం నుంచి లక్షరూపాయలను బాధిత కుటుంబం బ్యాంకు ఖాతాకు పంపించారు.
పిట్టగోడ కూలి..
విజయవాడకు చెందిన చింతా కుమారి, శివప్రసాద్ పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వేర్వేరు మతాలు కావడం వల్ల.. ఇరు కుటుంబాలూ తిరస్కరించాయి. ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న అతడికి నెలకు రూ.20 వేల జీతం, మరో ఐదు వేల రూపాయల వరకు ఇతర భత్యాలూ వచ్చేవి. ఇద్దరు పిల్లలతో సంసారం సాఫీగా సమయంలో.. శివప్రసాద్ కూర్చున్న పిట్టగోడ కూలిపోయి ఆయన వెన్నెముక దెబ్బతింది. తీవ్రగాయాలతో కాళ్లు చచ్చుబడిపోయి.. మంచానికే పరిమితమయ్యారు. ఏమీ చదువుకోని కుమారి.. అప్పటినుంచి మొత్తం కుటుంబానికి వెన్నుదన్నుగా నిలుస్తోంది.
భర్తను భుజాన ఎత్తుకుని కుమారి ఆస్పత్రులకు తిరిగింది. వైద్యం కోసం అప్పులూ చేసింది. ఆరేళ్లుగా ఇంటి దగ్గరే పానీపూరి బండి నిర్వహిస్తోంది. ఆ వచ్చే మొత్తంతో...ఆస్పత్రులు, మందుల ఖర్చులు భరిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది.
ప్రతి మహిళకూ ఆమె స్ఫూర్తిదాయకం..
'ఈటీవీ భారత్', 'ఈనాడు'లో వరుసగా ప్రచురితమైన కథనాల ద్వారా విషయం తెలుసుకున్న ఉపరాష్ట్రపతి.. భర్తకు అమ్మలా , పిల్లలకు ఆదరువుగా నిలబడిన చింతా కుమారి ప్రతి మహిళకూ స్ఫూర్తిదాయకమని అభినందించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా కుంగిపోకుండా.., కుమారిలా జీవితంలో నిలబడాలని ఆయన సూచించారు.
తమ వివరాలు తెలుసుకుని, బ్యాంకు ఖాతాకు వెంటనే లక్ష రూపాయల జమ చేసిన ఉపరాష్ట్రపతికి.. చింతా కుమారి, శివప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి