చెల్లెలి ఆవేదన చూసైనా వివేకా హత్య కేసు రహస్యాన్ని జగన్మోహన్ రెడ్డి బహిర్గతం చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. 'జగన్మోహన్ రెడ్డి బాబాయి కూతురు సునీతారెడ్డి తన తండ్రిని ఎవరు చంపారో తెలపాలంటూ.. హస్తిన రోడ్లపై ఆర్తనాథాలు చేస్తోంది. దిల్లీలో సునీత పెట్టిన మీడియా సమావేశం చూశాక కూడా.. జగన్ హృదయం కరగట్లేదా? వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో జగన్‌కు తెలిసే అవకాశం ఉందన్నట్లుగా సునీత మాట్లాడారు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడే జగన్‌కు హత్య ఎవరు చేయించారో తెలుసు. తెలిసి కూడా రాజకీయ అవసరం కోసం ఆనాడు సీబీఐ విచారణ అడిగి, కేసును చంద్రబాబు మీదకి నెట్టాలని చూసి.. సీఎం అయ్యాక వెనక్కి తగ్గారు.' అని వర్ల విమర్శించారు.
వివేకా హత్య జరిగి రెండేళ్లు దాటినా ఎవరు హత్య చేశారో తెలియట్లేదంటూ తిరుగుతున్న సునీత దయనీయ పరిస్థితిపై ఏం సమాధానం చెప్తారు. రహస్యం బయటపడకూడదనే సిట్ దర్యాప్తునకు నేతృత్వం వహించిన పోలీసు అధికారిని తొలగించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోవటం, కొంతమంది పెద్దల ప్రభావితం చేసిన కారణాలతోనే సీబీఐ దర్యాప్తు నత్తనడకన సాగుతోంది. పరిటాల రవి హత్యలో సాక్షులు చనిపోయిన రీతిలోనే వివిధ రూపాల్లో వివేకా హత్య సాక్షులు చంపబడుతున్నారు. బాబాయి హత్యలో సాక్షులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత సీఎం, డీజీపీలకు లేదా? - వర్ల రామయ్య, తెదేపా నేత
ఇదీ చదవండి: పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టులో జనసేన పిటిషన్