వర్క్ ఫ్రమ్‌హోమ్ పుణ్యమాని ఆఫీసు, సమస్త ప్రపంచం.. ఇల్లే అయిపోవడంతో అదంటే విసుగొచ్చే మాట కొంత వాస్తవమే. కానీ ఆ ఇంటిని కూడా మీ వాలైంటెన్స్‌డే వేదికగా మార్చుకోవచ్చు. మీ ఇంటి ఫర్నిచర్ విషయంలో చిన్నచిన్న మార్పులు చేయండి. ముఖ్యంగా మీవారికి ఇష్టమైన గదిని రంగులతో అందంగా, రొమాంటిక్‌గా మార్చేయండి. ఆ మార్పు చూసి ‘వావ్ కొత్తగా ఉందే!’ అని మీవారు మెచ్చుకునేలా ఉండాలి. మార్పులు, చేర్పులూ అన్నీ అయిపోయాక పరిమళాలు పంచే అందమైన పూల గుచ్ఛాన్ని ఉంచడం మాత్రం మరిచిపోకండే.
* గతేడాది మనమంతా ఎన్నో ఒత్తిళ్లని ఎదుర్కొన్నాం. ఉద్యోగాల పరంగా, పిల్లల చదువులు.... డబ్బు ఇలా ఎన్నో విషయాల్లో. నిజానికి ఆ ఒత్తిడి మన నుంచి ఇంకా దూరం కాలేదు. అందుకే ఒకరినొకరం అర్థం చేసుకునేందుకు, ఆ బాధలన్నీ మరిచిపోయేందుకు ఈ రోజుని ఒక వేదికగా మార్చుకుందాం. వీలుంటే దగ్గర స్నేహితులని పిలిచి చిన్నవేడుకలా చేసుకున్నా తప్పులేదు. ఒత్తిడి మాయమవుతుంది. లేదా.. ఏకాంతమే ఇష్టం అనుకుంటే ఆన్‌లైన్‌లో కపుల్ ఫిట్‌నెస్ పేరుతో మనసుని తేలికపరిచే అనేక గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. సరదాగా ఆడిచూడండి. గెలిచినవారికి కానుక ఇవ్వండి. మీ అందమైన జ్ఞాపకాల్లో మరొకటి వచ్చి చేరుతుంది.
* అరిగిపోయిన కథే కదా అనుకోకుండా మీ ప్రేమకథనే మరొక్కసారి తలుచుకునే ప్రయత్నం చేయండి. ఆన్‌లైన్‌లో మీ లవ్‌స్టోరీని ప్రచురించడానికి అనేక డిజిటల్ వేదికలు ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా అందమైన కవర్ పేజీని ఎంచుకోవడం, మీ ప్రేమకథని రాసి పెట్టడం. ఆర్డర్ ఇస్తే చాలు... మీ ప్రేమ కథ పుస్తకం రూపంలో ఇంటికే వచ్చేస్తుంది. ఆసక్తి ఉంటే ఒక వ్లోగ్‌ని కూడా తయారుచేయొచ్చు. అద్భుతమైన మీ ప్రేమకథ వైరల్ అయినా అవ్వొచ్చు.