ఆరోగ్యశ్రీ కార్డులపై ప్రధాని మోదీ చిత్రాలు లేకపోవడంపై కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రధానమంత్రికి ఫిర్యాదు చేస్తానని ఆమె హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ పథకం ఆయుష్మాన్ భారత్‌ను సమూలంగా మార్చి వేశారని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రి శుక్రవారం ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించారు. జి.కొండూరు, మైలవరం ప్రాంతాల్లో పర్యటించి విజయవాడలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వచ్చారు. అక్కడ ఆరోగ్య మిత్ర హెల్ప్‌డెస్కుకు ముఖ్యమంత్రి జగన్ చిత్రాలు కనిపించకుండా వస్త్రాలతో కప్పేశారు. ఆసుపత్రిలో వివిధ విభాగాలను పరిశీలించిన ఆమె ఆరోగ్య మిత్ర హెల్ప్‌డెస్క్ వద్దకు వచ్చారు. ఆయుష్మాన్ భారత్ కింద రూ.5లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తున్నామని వివరిస్తూ ఇక్కడ ఎలా అమలు జరుగుతోందని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ నివాస్‌ను ప్రశ్నించారు.
అక్కడే కొంతమంది భాజపా నాయకులు ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నారని తెలిపారు. దీంతో ఆరోగ్యశ్రీ కార్డు అడిగి తీసుకుని దానిపై ప్రధాని చిత్రం లేకపోవడాన్ని ఆమె ప్రశ్నించారు. దీనిపై ప్రధానికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. జీజీహెచ్‌లో టెలిమెడిసిన్ విభాగంలోనూ ప్రధాని చిత్రం అప్పటికప్పుడు అతికించడాన్ని తప్పుపట్టారు.
ఇవీ చూడండి: