విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో 'గుడికో గోమాత' పేరిట ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించారు. తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి హిందూ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, తితిదే జేఈవో బసంత్ కుమార్, పాలకమండలి సభ్యులు కొలుసు పార్ధసారధి, దుర్గ గుడి ఆలయ ఛైర్మన్ పైలా సోమినాయుడు , ఈవో సురేష్ బాబు, ఎమ్మెల్యేలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గోవును పూజిస్తే తల్లిని పూజించినట్టేనని.. అన్ని దేవాలయాలకు తాము గోవులను అందజేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. భక్తులు కూడా తితిదేకి గోవులను ఇవ్వటానికి ముందుకు రావాలని కోరారు. త్వరలో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పాటు పీఠాధిపతుల ఆధ్వర్యంలో ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాలకు గోవులను అందిస్తామన్నారు. గోవుల సంరక్షణ విషయంలో ఆలయ అధికారులు పూర్తి బాధ్యత వహించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రతి ఒక్కరు గోవులను పెంచాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించినట్లు మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఆలయాల పరిధిలో అర్చనలు, అభిషేకాలు, యజ్ఞయాగాది క్రతువులలో వినియోగించే ప్రధాన ద్రవ్యాల కోసం ఆవులను అందజేస్తున్నట్లు తితిదే జేఈవో బసంతకుమార్ తెలిపారు. దుర్గగుడికి గోవును ధర్మ ప్రచార పరిషత్తు కార్య నిర్వాహక సభ్యుడు బొమ్మదేవర వెంకటసుబ్బారావు బహుకరించారు.
ఇదీ చదవండి: