రైళ్లు గంటకు 135 కి. మీ వేగంతో వెళ్తే సికిద్రాబాద్ నుంచి విజయవాడ 3.30 గంటల్లో చేరుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఆదివారం కాజీపేట-విజయవాడ మధ్య సీవోసీఆర్ (కన్‌ఫర్మేటరీ ఆస్కిలోగ్రాఫ్ కార్ రన్) రైలు పరుగు విజయవంతమైంది. 135 కి.మీ. గరిష్ఠ వేగంతో 24 బోగీలతో ఉదయం 10.30 గంటలకు కాజీపేటలో ప్రారంభమైన రైలు మధ్యాహ్నం 12.30 గంటలకు విజయవాడ చేరుకుంది. ప్రస్తుతం కాజీపేట నుంచి విజయవాడకు 3-3.5 గంటలు పడుతోంది.
రైళ్ల గరిష్ఠ వేగం గంటకు 110 కి.మీ. రాజధాని రైళ్ల వేగం మాత్రం 120 కి.మీ. తాజా పరీక్ష నేపథ్యంలో గంటకు 135 కి.మీ. గరిష్ఠ వేగంతో రైలు వెళితే సికింద్రాబాద్ నుంచి కాజీపేటకు గంటన్నరలో చేరుకోవచ్చు. కాజీపేట నుంచి విజయవాడకు 2 గంటల్లో వెళ్లొచ్చని అధికారులు చెబుతున్నారు. ఎలాంటి అవరోధాలు లేకపోతే సికింద్రాబాద్ నుంచి విజయవాడకు 3.30 గంటల్లో చేరుకోవచ్చు. ఇప్పుడు దాదాపు ఐదున్నర గంటల సమయం పడుతోంది. సికింద్రాబాద్ నుంచి విజయవాడకు రెండు మార్గాలున్నాయి. ఒకటి కాజీపేట, వరంగల్ మీదుగా.. రెండోది నడికుడి మీదుగా. ప్రస్తుతం సికింద్రాబాద్ - కాజీపేట - విజయవాడ మార్గం (350 కిలోమీటర్లు)లో రైల్వే ట్రాక్ సామర్థ్య పరీక్షలు పూర్తయ్యాయి.
వీటిని అధిగమిస్తేనే...
మార్గమధ్యలో రైలు పలు స్టేషన్లలో ఆగడం.. స్టేషన్ రావడానికి కొద్దిదూరం నుంచి వేగం తగ్గడం.. అక్కడి నుంచి బయల్దేరాక కొద్దిదూరం వరకు తక్కువ వేగంతో వెళ్లడం.. మలుపులున్నచోట, కల్వర్టులు, వంతెనలు, లెవల్ క్రాసింగ్‌లున్నచోట వేగం గణనీయంగా తగ్గడం.. లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే సగటు వేగం బాగా తగ్గుతుంది. ఈ అవరోధాలన్నింటినీ తొలగిస్తేనే సికింద్రాబాద్ నుంచి విజయవాడకు 3.30 గంటల్లో చేరుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
కొవిడ్ వేళ రైలు పట్టాల పటిష్ఠం
కొవిడ్ లాక్‌డౌన్ వేళ రైళ్లు పరిమితంగా తిరగడంతో రైల్వేశాఖ ఆ ఖాళీ సమయాన్ని వినియోగించుకుంది. పాత పట్టాల స్థానంలో కొత్తవి మార్చింది. 135 కి.మీ. వేగాన్ని సైతం తట్టుకునేలా ట్రాక్‌ను పటిష్ఠం చేసింది. సికింద్రాబాద్ - కాజీపేట, కాజీపేట-బల్లార్ష, కాజీపేట - విజయవాడ, విజయవాడ-చెన్నై మార్గాల్ని ఈ వేగానికి తగ్గట్లుగా బలోపేతం చేసింది.
ఇదీ చదవండి: దేశంలో 66 లక్షలు దాటిన కరోనా కేసులు