కడప జిల్లా
పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేమని...కడప కలెక్టర్ హరి కిరణ్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కడప పోలీసు మైదానంలో పోలీస్ అమరవీరుల స్థూపానికి పుష్పగుచ్ఛాలు పెట్టి నివాళులర్పించారు. అనంతరం విధుల్లో మృతిచెందిన పోలీస్ కుటుంబాలకు జ్ఞాపికలను అందజేశారు. దేశవ్యాప్తంగా గడిచిన ఏడాదిలో 263 మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. పోలీసులకు ఎల్లప్పుడూ జిల్లా రెవెన్యూ శాఖ సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ అన్నారు.
అనంతపురం జిల్లా
అనంతపురం జిల్లా ధర్మవరంలో పోలీస్ అమర వీరులకు ఘనంగా నివాళులర్పించారు. పట్టణ సీఐ కరుణాకర్ ఎస్ఐ సతీష్ కుమార్ పోలీసులు అమరవీరులకు పుష్పాంజలి ఘటించి...గౌరవ వందనం చేశారు. 11మంది మాజీ సైనికులు పాల్గొన్నారు.
కర్నూలు జిల్లా
పోలీసులు లేని సమాజాన్ని ఉహించలేమని కర్నూలు జిల్లా కలెక్టర్ వీర పాండియన్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాన్ని పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు కర్నూలు రేంజ్ డీఐజీ వెంకటరామిరెడ్డి, కలెక్టర్ వీర పాండియన్, జిల్లా ఎస్పీ డాక్టర్. ఫక్కీరప్ప, జిల్లా అధికారులు నివాళులర్పించారు.
గుంటూరు జిల్లా
బలహీనులకు పోలీసులు అండగా నిలవాలని... వారికి సత్వరన్యాయం అందేలా కృషి చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ పిలుపునిచ్చారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో జిల్లా న్యాయమూర్తి గుమ్మడి గోపిచంద్‌తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. నాడు చైనాతో అప్పటి పోలీసులు పోరాడితే... నేడు చైనా నుంచి వచ్చిన కంటికి కన్పించని వైరస్‌తో ఇప్పటి పోలీసులు పోరాడుతున్నారని కలెక్టర్ గుర్తు చేశారు.
విశాఖ జిల్లా
విశాఖ బీచ్ రోడ్డులో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. అమరవీరుల స్థూపానికి పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి ఒక్క పోలీసు నీతి, నిజాయితీతో ప్రజలకు సేవ చేయడమే అమరులకు నిజమైన నివాళి అవుతుందని సీపీ సిన్హా అన్నారు.