TNSF Call Protest at DEO Offices: రాష్ట్రంలో 3, 4 ,5 తరగతుల పాఠశాలల విలీనం ఆపాలని డిమాండ్ చేస్తూ.. ఈనెల 9న రాష్ట్రవ్యాప్తంగా డీఈవో కార్యాలయాల ఎదుట నిరసనకు టిఎన్ఎస్ఎఫ్ పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పాఠశాలల విలీన ప్రక్రియను వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో జీవో నంబర్ 117 తీసుకొని వచ్చి రేషనలైజేషన్ పేరిట విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి. ప్రణవ్ గోపాల్ మండిపడ్డారు.
స్టూడెంట్, టీచర్ రేషియోతో సంబంధం లేకుండా ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా, అకారణంగా ఉపాధ్యాయ పోస్టులను తగ్గించారని ధ్వజమెత్తారు. భవిష్యత్తులో పదేళ్ల వరకు డీఎస్సీ అవసరమే రానట్లుగా విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యావేత్తలు, విద్యార్థులు, మేధావులు అందరూ స్పందించి పాఠశాలల విలీన ప్రక్రియపై పోరాటానికి సిద్ధం కావాలని కోరారు. జూలై 9 శనివారం రాష్ట్రవ్యాప్తంగా డీఈవో కార్యాలయాల ముందు చేపడుతున్న నిరసన కార్యక్రమంలో పాల్గొన్ని విజయవంతం చేయాలని ప్రణవ్ గోవాల్ కోరారు.