జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ ఇటీవల దాఖలు చేసిన రెండు అభియోగపత్రాలపై సీబీఐ కోర్టు(jagan cbi cases news) విచారణ ప్రక్రియ ప్రారంభించింది. జగన్కు నేటి విచారణ నుంచి న్యాయస్థానం మినహాయింపునిచ్చింది. వాన్ పిక్, లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసులో వైకాపా నేతలు విజయసాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు హాజరయ్యారు. సమన్లు అందుకున్న తెలంగాణ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు జె.గీతారెడ్డి, పారిశ్రామికవేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్, నిమ్మగడ్డ ప్రకాష్, శ్యాంప్రసాద్ రెడ్డి, ఐఏఎస్ అధికారి మురళీధర్ రెడ్డి, విశ్రాంత అధికారులు బీపీ ఆచార్య, శామ్యూల్, మన్మోహన్ సింగ్, బ్రహ్మానందరెడ్డి హాజరయ్యారు. వాన్ పిక్ కేసులో నిందితుడిగా ఉన్న మోపిదేవి వెంకటరమణకు సమన్లు అందాయా లేదా తెలపాలని ఈడీని ఆదేశిస్తూ విచారణ అక్టోబరు 28కి వాయిదా వేసింది.
గృహ నిర్మాణ ప్రాజెక్టులపై సీబీఐ కేసులో అభియోగాల నమోదుపై వాదనలు వినిపించాలని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని సీబీఐ కోర్టు ఆదేశించింది. ఇదే కేసులో నిందితుడు జితేంద్ర వీర్వానిపై విచారణకు హైకోర్టు స్టే ఇచ్చిందని.. మరోవైపు సుబ్బారెడ్డి క్వాష్ పిటిషన్ పెండింగులో ఉందని ఆయన తరఫు న్యాయవాది పేర్కొన్నారు. జితేంద్ర వీర్వానిపై స్టే ఉత్తర్వులు ఆయనకే పరిమితమని.. వైవీ సుబ్బారెడ్డికి వర్తించదని.. విచారణ కొనసాగించాలని సీబీఐ పేర్కొంది. సీబీఐ కేసుల్లో జగన్, విజయసాయిరెడ్డి డిశ్చార్జ్ పిటిషన్లపై కౌంటరు దాఖలు చేసేందుకు సీబీఐ మరోసారి గడువు కోరింది. ఎమ్మార్ ఈడీ కేసుపై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఎమ్మార్ కేసులో కోనేరు ప్రదీప్ ప్రమేయంపై ఇంకా విచారణ కొనసాగుతోందని.. మిగతా నిందితులపై దర్యాప్తు ముగిసిందని కోర్టుకు తెలిపింది. ఎమ్మార్ ఈడీ కేసు విచారణ ఈనెల 29కి న్యాయస్థానం వాయిదా వేసింది.
ఇదీ చదవండి: