కొవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా మాస్కులు లేకుండా వాణిజ్య సముదాయాలు, దుకాణాల్లోకి అనుమతిస్తే భారీగా జరిమానా విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్ ప్రోటోకాల్ పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తే.. సదరు వాణిజ్య సంస్థలు, దుకాణాల యాజమాన్యానికి రూ.10 వేల నుంచి రూ.25 వేల జరిమానా విధించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు నియంత్రణలోకి రావటంతో కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేస్తూ వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్ ప్రోటోకాల్ ఉల్లంఘన తీవ్రతను అనుసరించి రెండు రోజుల పాటు సదరు దుకాణం, వాణిజ్య సముదాయం మూసివేతకు కూడా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు లేకుండా తిరిగే వ్యక్తులకు రూ.100 జరిమానా విధించాల్సిందిగా సూచించింది.
వైద్యారోగ్యశాఖ అధికారులతో పాటు సబ్ ఇన్స్పెక్టర్ లేదా ఆపై అధికారికి కూడా జరిమానా వసూలు చేసే అధికారాలు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు అన్ని జిల్లాల్లోనూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ రాష్ట్రంలో 144 సెక్షన్ విధిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు ఈ నెల 21 తేదీ వరకూ రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూను పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి