ముఖ్యమంత్రి జగన్..జస్టిస్ ఎన్.వి.రమణకు వ్యతిరేకంగా సీజేఐ ఎస్.ఏ. బాబ్డేకు లేఖ రాయడాన్ని ఏఐబీఏ అధ్యక్షుడు ఆదిష్ అగర్వాలా తీవ్రంగా ఖండించారు. లేఖలో పేర్కొన్న అంశాలన్నీ "కుట్రపూరితం, దుర్దుద్దేశంతో" కూడుకున్నవని ఆరోపించారు. కాబోయే ప్రధాన న్యాయమూర్తికి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా జగన్ రాసిన లేఖ న్యాయవ్యవస్థ స్వతంత్రతకు భంగం కలిగించేదిగా ఉందని అసోసియేషన్ తరపున విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
న్యాయస్థానాలను బెదిరించడమే..
మనీలాండరింగ్ సహా.. ఇతర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి ఈ స్థాయిలో న్యాయమూర్తులపై ఆరోపణలు చేయడం అవాంఛనీయమని అని అగర్వాల అన్నారు. ఇది న్యాయస్థానాలను, న్యామమూర్తులను బెదిరించి.. తమకు అనుకూలమైన తీర్పులను రప్పించుకునేందుకు వేసిన ఎత్తుగడగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి న్యాయప్రక్రియను అపహాస్యం చేస్తున్నారని.. ఏఐబీఏ తన ప్రకటనలో పేర్కొంది. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న ఉత్తర్వులపై రాజ్యాంగబద్ధంగా అప్పీల్ చేసుకునే అవకాశం ఉండగా... ముఖ్యమంత్రి దానిని కాదని న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తున్నారని.. ఇది సరైన చర్య కాదని తప్పు పట్టింది. ఈ తరహా చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రమాదకరమని వ్యాఖ్యలు చేసింది. పైగా ముఖ్యమంత్రి లేఖ రాసిన విధానం చూస్తే.. తన కేసులకు సంబంధించి.. కొంత మంది న్యాయమూర్తులు విచారించకుండా "బెంచ్ హంటింగ్ " ప్రక్రియకు పాల్పడుతున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించింది.
దురుద్దేశంతో కేసులు
ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలోని భాష, రాసిన సందర్భం చూస్తేనే ఇందులో ముఖ్యమంత్రికి రహస్య అజెండా, అనుచిత ప్రయోజనాలు ఉన్నాయన్న స్పష్టమవుతుందని అసోసియేషన్ పేర్కొంది. " ప్రజాప్రతినిధుల అవినీతి కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేయాలన్న ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని జస్టిస్ ఎన్వీరమణ నేతృత్వంలోని బెంచ్ చేపట్టింది. ముఖ్యమంత్రిపై లెక్కకు మించి అవినీతి, మనీలాండరింగ్ కేసులున్న విషయం ప్రజలకు తెలియంది కాదు. ఈ సందర్భంలో జస్టిస్ రమణకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి లేఖరాయడంలోని అంతరార్థాన్ని అర్థం చేసుకోవచ్చు" అని తెలిపింది. ముఖ్యమంత్రి రమణ కుమార్తెలపై నిరాధార ఆరోపణలతో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయడం బాధాకరమైన విషయమని కూడా అసోసియేషన్ తన ప్రకటనలో పేర్కొంది.
ఇదీచదవండి