ఉద్యోగం రాలేదన్న బాధతో నిరుద్యోగులు చేసుకున్న ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు ధ్వజమెత్తారు. ఈ చావులకు ముఖ్యమంత్రి జగనే కారకులని విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండిపడ్డారు.
" సీఎం జాబ్ క్యాలెెండర్తో నిరుద్యోగుల్లో నిరాశ పెరిగి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పదిరోజుల వ్యవధిలో కర్నూలు జిల్లాలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్, జిల్లా మంత్రులు సైతం ఈ ఆత్మహత్యలపై కనీసం స్పందించలేదు. ఈ చావులకు ముఖ్యమంత్రే కారకులు. చనిపోయిన ప్రతి నిరుద్యోగి కుటుంబానికి రూ.25లక్షల ఆర్థిక సాయం, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించాలి. ఇచ్చిన హామీ ప్రకారం 2.30లక్షల ఉద్యోగాలతో కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. నిరుద్యోగులకు న్యాయం చేసే వరకు మా పోరాటం కొనసాగుతుంది' అని శ్రీరామ్ చినబాబు హెచ్చరించారు.
నిందితుల్ని వైకాపా కాపాడుతోంది: తెదేపా ఎస్సీ సెల్
ఎస్సీలపై దాడికి పాల్పడి, హత్య చేసిన నిందితుల్ని వైకాపా ప్రభుత్వం కాపాడుతోందని తెదేపా ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎంఎస్ రాజు ఆరోపించారు. 'రాష్ట్రంలో ఎస్సీల మనుగడ అసాధ్యంగా మారిందని... ఎస్సీలపై జరిగిన అనేక ఘటనలే అందుకు నిదర్శనం అన్నారు. మాస్కు పెట్టుకోలేదని చీరాలలో దళిత యువకుడిని కొట్టి చంపిన పోలీసులు.. ఏనాడు మాస్కు పెట్టుకోని ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ఏం చేయాలని మండిపడ్డారు. రాక్షస రాజ్యాన్ని అంతమొందించే రోజు దగ్గరలోనే ఉందన్న ఆయన.. అఖిలపక్ష నేతల్ని కలుపుకుని ఎస్సీలంతా త్వరలోనే ప్రభుత్వ వ్యతిరేక పోరాటం చేపడతామని రాజు హెచ్చరించారు.
విశాఖ భూ కుంభకోణంపై సిట్ నివేదికలో పేర్లు బయటపెట్టాలి: ఎంపీ రఘురామ