ఏపీ-తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రజలు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలతో పోలిస్తే... ఆంధ్రప్రదేశ్‌కే ప్రజలు తెలంగాణాకు, తెలంగాణ రాష్ట్రంలో నివసించే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏపీకీ వెళుతుంటారు. రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ఆర్టీసీ సర్వీసులు నడవకపోవడం వల్ల అసలే కష్టాల్లో ఉన్న ఆర్టీసీకి అది మరింత నష్టాన్ని మిగిల్చినట్లు తెలుస్తోంది. 2019లో ఆర్టీసీ సమ్మె వల్ల బస్సులు కేవలం డిపోలకే పరిమితమయ్యాయి. 2020లో కరోనా కట్టడిలో భాగంగా ఆర్టీసీ బస్సులను నడిపించలేదు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చాక... జిల్లాల్లో ఆర్టీసీ బస్సులను నడిపిస్తోంది. వీటితోపాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకూ ఆర్టీసీ బస్సులను నడిపిస్తోంది. ఏపీకు మాత్రం ఇంకా అంతర్రాష్ట్ర సర్వీసులు ప్రారంభించలేదు.
లాక్డౌన్ ముందు తెలంగాణలోని 72 రూట్లలో ఏపీఎస్ఆర్టీసీ 1,006 బస్సులను 2,64,275 కి.మీలు తిప్పేది. ఆంధ్రప్రదేశ్‌లో టీఎస్ఆర్టీసీ 27 రూట్లలో 746 బస్సులను 1,61,800 కి.మీ.లు నడిపించేది. 2020లో ఆర్టీసీ దసరా పండుగ సందర్బంగా సుమారు 3వేల ప్రత్యేక బస్సులను నడిపించినప్పటికీ అవి కేవలం రాష్ట్రానికే పరిమితమయ్యాయి.
సంవత్సరం | నష్టం(రూ. కోట్లలో) |
2014-15 | 420 |
2015-16 | 710 |
2016-17 | 770 |
2017-18 | 650 |
2018-19 | 531 |
ఇప్పుడిప్పుడే గాడినపడుతున్న ఆర్టీసీకి దసరా పండుగ ఆదాయం కోల్పోవడం నష్టమే అని కార్మిక సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. 2018లో దసరా పండక్కి తెలంగాణ ఆర్టీసీ 4,800 బస్సులు నడపగా.. ఏపీకి 600 బస్సులు నడిపి రూ. 90 లక్షల ఆదాయం సమకూర్చినట్లు అధికారులు తెలిపారు. ఇక ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణలో 800 నుంచి వేయి బస్సులు నడిపగా రూ. కోటి నుంచి రూ. కోటిన్నర వరకు ఆదాయం వచ్చినట్లు సమాచారం.
అంతరాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్దరణపై ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు మంగళవారం మరోసారి భేటీ కానున్నారు. ఈ సమావేశంలో అంతరాష్ట్ర సర్వీసులపై కీలకమైన ప్రకటన వెలువడే అవకాశాలున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. అన్నీ ..అనుకున్నట్లు జరిగితే.. ఈ భేటీలోనే పూర్తిస్థాయిలో ఒప్పందం జరిగే అవకాశాలున్నాయి.
ఇదీ చదవండిః పోలవరం ప్రాజెక్టు డ్యామ్ నిర్మాణానికి మాత్రమే నిధులిస్తాం: కేంద్రం