విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తెలుగు మహిళల ఆధ్వర్యంలో మహిళలు ఆందోళనలు చేపట్టారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు మానస పుత్రిక ఐన డ్వాక్రా గ్రూపులను ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి మండిపడ్డారు. మహిళలు ఇంట్లో ఇబ్బంది పడకూడదని ఉద్దేశంతో డ్వాక్రా మహిళలకు ఇచ్చిన గ్యాస్ కనెక్షన్లు ఉనికి లేకుండా చేసేలా గ్యాస్ ధరలు భారీగా పెంచడం దారుణమని ఉషారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెంటనే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని.. మూసివేసిన అన్నా క్యాంటీన్లను తెరిచి పేదలకు పిడికెడు అన్నం అందేలా చూడాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా తెలుగు మహిళ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆమె హెచ్చరించారు. కార్యక్రమంలో పార్లమెంట్ నియోజకవర్గం తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి నాదెళ్ల నాగమణి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు సరిత, పలువురు పాల్గొన్నారు.
ఇదీచదవండి..