బోనాల సంస్కృతి నిజాం నవాబుల కాలం నుంచి నేటి హైటెక్ యుగం వరకు హైదరాబాదీల జీవనంలో భాగమైంది. ఏటా వర్షాకాలంలో వచ్చే మహమ్మారుల నుంచి రక్షించాలని ప్రకృతిని వేడుకుంటూ దాదాపు అన్ని కూడళ్లలో ఉన్న అమ్మవార్ల ఆలయాల్లో బోనాలు నిర్వహిస్తుంటారు. బోనాలకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో చరిత్ర ఉంది.
1869లో జంటనగరాల్లో మలేరియా ప్రబలడంతో తీవ్ర ప్రాణనష్టం జరిగింది. అప్పుడు అమ్మవారిని ప్రసన్నం చేసుకునే పేరిట తొలి జాతర నిర్వహించారు. తర్వాత నిజాం కూడా బోనాలు అధికారికంగా నిర్వహించేందుకు ఉత్తర్వులిచ్చారు.
తొలి బోనం మనదే..!
హైదరాబాద్‌లో బోనాలు ప్రారంభమయ్యేది, ముగిసేది గోల్కొండ కోట మీద ఉన్న జగదాంబిక ఆలయంలోనే. ఈసారి జులై 5న గోల్కొండలో ప్రారంభమవుతాయి. జులై 12న లష్కర్, 19న పాతబస్తీ లాల్‌దర్వాజా బోనాలు మొదలవనున్నాయి.
కరోనా వల్ల రంజాన్ వేడుకలు ఇళ్లలోనే సాగిపోగా... అదే ప్రభావం ఇప్పుడు బోనాలు, తర్వాత రాబోయే వినాయక చవితి ఉత్సవాల మీద పడనుంది. గ్రేటర్ పరిధిలో కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల బోనాల పండుగను ఎవరి ఇళ్లలో వారే నిర్వహించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
- ఇదీ చూడండి: అమ్మా.. అని పిలిపించుకోకముందే.. ఆ తల్లి..