TDP leader GV Reddy on YSRCP: తెదేపా హయాంలోనే రాష్ట్రానికి ఏటీసి టైర్ల కంపెనీ వచ్చిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి స్పష్టం చేశారు. 2018లో ఏటీసి కంపెనీ ప్రతినిధులతో చంద్రబాబు చర్చలు జరిపారనే విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు తెచ్చిన పరిశ్రమలను.. జగన్ రెడ్డి తెచ్చినట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. జగన్ ఉన్న పరిశ్రమలని వెళ్లగొట్టడం, కక్ష సాధింపుతో బిల్డింగులను పడగొట్టడం తప్ప.. మూడేళ్లలో సాధించిందేంటని ప్రశ్నించారు. చంద్రబాబు పరిశ్రమలకు భూములు కట్టబెడుతున్నారని నాడు విషప్రచారం చేసిన జగన్.. నేడు అదే భూముల్లో శంకుస్థాపనలు ఎలా చేస్తున్నారని నిలదీశారు.
సీఎం దావోస్ పర్యటన వల్ల ఏపీకి ప్రయోజనం శూన్యమని కేంద్రం మాటల్లో అర్థమైందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగాలు లేకనే యువత పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని తెలిపారు. వైకాపా నేతలు చెప్పినట్టు రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు విపరీతంగా వస్తే అడ్డగోలుగా అప్పులు చేయాల్సిన అవసరం ఏంటని మండిపడ్డారు. లిక్కర్ ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు జగన్ రెడ్డి రాష్ట్రంలో మద్యం ఏరులై పారిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నేతలు ఇకనైనా అబద్ధాలు, తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మోసం చేయటం మానుకోవాలని హితవు పలికారు.
ఇవీ చదవండి: