కొత్త కమిటీల నియామకం తర్వాత అధినేత చంద్రబాబు అధ్యక్షతన..తొలిసారిగా తెలుగుదేశం పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ సమావేశాలు ఎన్టీఆర్ భవన్‌లో జరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ భేటీల్లో మతపరమైన చర్చ జరిగింది. ఎక్కువ శాతం హిందూ ధర్మ పరిరక్షణ, హిందూ మతంపై దాడులు గురించే చర్చ జరిగింది. రాష్ట్రంలో దేవాలయలపై దాడులకు సంబంధించి దాదాపు 136 ఘటనలు జరిగినట్లు జాబితా సిద్ధం చేశారు. వీటిలోని ఏ అంశంలోనూ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించలేదని...ఎవరి మీదా చర్యలు తీసుకోలేదని పొలిట్ బ్యూరో అభిప్రాయపడింది. ఇందుకనుగుణంగా హిందూ ధర్మ పరిరక్షణ బాధ్యతలను తాము తీసుకున్నామనే సంకేతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనే నిర్ణయానికి పొలిట్ బ్యూరో వచ్చినట్లు సమాచారం. ఇందుకనుగుణంగా దేవాలయాలపై వరుస దాడులకు సంబంధించి..జాతీయ స్థాయిలో చర్చ చేపట్టాలని నిర్ణయించింది.
ముఖ్యమంత్రి సహా హోం మంత్రి, డీజీపీ కూడా క్రైస్తవులేనంటూ తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యులు ఆరోపించారు. ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న ముగ్గురు క్రైస్తవులు ..హిందూ మతం విషయంలో మరింతగా జాగ్రత్త వహించాల్సింది పోయి..అందుకు విరుద్ధంగా ఉన్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో తెలుగుదేశం నేతలపై జరుగుతున్న దాడులు, హత్యలపైనా పొలిట్‌బ్యూరోలో చర్చ జరిగింది. ప్రభుత్వం, అధికార పార్టీ నేతలు తెలుగుదేశం నేతలపై దాడులను ప్రొత్సహిస్తున్నారని పొలిట్‌బ్యూరో సభ్యులు అభిప్రాయపడ్డారు. బాధితులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.
ఇదీచదవండి
ఆలయాలపై దాడుల మీద సీబీఐ విచారణకు ఆదేశించాలి: తెదేపా పొలిట్‌బ్యూరో