పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలే అజెండాగా తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సమావేశం కానుంది. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ కమిటీల ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పార్టీ ప్రక్షాళన దిశగా కీలక చర్యలు ఉంటాయని తెలుస్తోంది.
ప్రజా సమస్యలపై పోరాటానికి వ్యూహరచన !
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత నేడు తొలిసారిగా తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సమావేశమవుతోంది. ఎన్నికల్లో ఓటమిపై ఈ భేటీలో కీలక చర్చ జరగనుంది. ప్రజాసమస్యలపై పోరాటానికి పొలిట్‌బ్యూరోలో వ్యూహరచన చేయనున్నట్లు సమాచారం. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు, పురపాలక, నగరపాలక, సహకార ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున... పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకోవడమే లక్ష్యంగా కమిటీలు ఏర్పాటు చేయున్నారు. రాష్ట్ర పార్టీ సంస్థాగత ఎన్నికల అడ్‌హక్ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. పార్టీకి అనుబంధంగా 16 విభాగాల కార్యవర్గం ఏర్పాటు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సంధానకర్తల నియామకంపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
యువతకు పెద్దపీట
పార్టీని బలోపేతం చేయటానికి యువతకు ప్రాధాన్యత కల్పించాలని తెదేపా భావిస్తోంది. అందుకోసం పార్టీ పదవుల్లో 40శాతం యువతకే ఇవ్వాలనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయ ప్రత్యర్థులను తట్టుకోవాలంటే యువ నాయకులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నారు. పార్టీలో సీనియర్ల అధిపత్యంపై యువతలో అసంతృప్తితో ఉన్నట్లు అంచనాకొచ్చిన అధినేత తెదేపాలో యువరక్తాన్ని ఎక్కించాలని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. పరిస్థితినిబట్టి కొందరు సీనియర్లను పక్కన పెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం.
సమస్యలపై సమరం
రాష్ట్రంలో ఇసుక సమస్య, నిరుద్యోగ భృతి నిలిపివేత, తెలుగుదేశం కార్యకర్తలపై దాడులు, సంక్షేమ పథకాల రద్దుపై పోరాటం వంటి వాటిపై చర్చ జరగనుంది. ఈ అంశాలపై పొలిట్‌బ్యూరోలో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. పొలిట్‌బ్యూరో నిర్ణయాలు క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు ఈ నెల 13న విజయవాడలో పార్టీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం నిర్వహించనున్నారు.
ఇదీచదవండి