తాము పదే పదే ప్రశ్నించడం వల్లే మాదకద్రవ్యాల దందాకు సంబంధించి మాచవరం సుధాకర్ పేరును పత్రికా ప్రకటనలో ఎన్ఐఏ అధికారులు చేర్చారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. దీంతో మాదకద్రవ్యాల దందాపై గత కొంతకాలంగా తాము సంధిస్తున్న ప్రశ్నల్లో వాస్తవం ఉందని తేలిందని అన్నారు.
కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, శాండ్ మెరైన్ సంస్థకు చెందిన ఆలీషాలను అదుపులోకి తీసుకుని ఎన్ఐఏ విచారణ జరిపిస్తే అన్ని వాస్తవాలు బట్టబయలవుతాయని పట్టాభి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా డ్రగ్ సిండికేట్ నడుపుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అతని కుటుంబసభ్యులేనని పట్టాభి ఆరోపించారు.
ఆఫ్రికా ఖండంలో రెడ్డి గ్లోబల్ ఇండస్ట్రీస్ చేస్తున్నఅక్రమ వ్యాపారాలపైనా ఎన్ఐఏ దృష్టి పెట్టాలని కోరారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి అమ్మే చీప్ లిక్కర్ దందా వెనుక ఆయన సోదరులు వైఎస్ అనిల్ రెడ్డి, వైఎస్ సునిల్ రెడ్డిల పాత్ర ఉందని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇంటిపైకి జోగి రమేష్ దాడిని సహకరించిన రీతిలోనే పోలీసులు.. కాకినాడలో తమపై దాడికి ద్వారంపూడి రౌడీలకు సహకరించారని మండిపడ్డారు. 420 ఐడియాలతో అకారణంగా మత్స్యకారుల అంశాన్ని ద్వారంపూడి తెరపైకి తెచ్చారని అన్నారు.
ఇదీ చదవండి: Harsha kumar: 'డ్రగ్స్ వ్యవహారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వాటా'