అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలతో నూతన జాబ్ క్యాలెండర్ ప్రకటించాలంటూ విద్యార్థి సంఘాలు విజయవాడలో ఆందోళన చేపట్టాయి. ఈ ఆందోళనకు తెదేపా నేతలు కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ అశోక్ బాబు, లక్ష్మణరావు మద్దతు తెలిపారు. జాబ్ క్యాలెండర్ పేరుతో జగన్ ప్రభుత్వం యువతను మోసం చేసిందని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. నెల రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చలనం లేదన్నారు. రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తానని జగన్.. రెండున్నర ఏళ్ల పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు.
ఇచ్చిన మాట ప్రకారం ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జగన్ దెబ్బకు రాష్ట్రంలోని పరిశ్రమలు, పారిశ్రామిక వేత్తలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని అన్నారు. నూతన జాబ్ క్యాలెండరుపై మండలి సమావేశాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీలు వాయిదా తీర్మానం ప్రతిపాదిస్తామని ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు చెప్పారు. నూతన జాబ్ క్యాలెండరు విడుదల చేసే వరకు నిరుద్యోగులకు అండగా ఉంటామని వెల్లడించారు.
కేంద్రం, రాష్ట్రం పోటీ పడి దోచుకుంటున్నాయి: బొండా ఉమా
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ విజయవాడలో తెదేపా ఆధ్వర్యంలో మహిళలు, కార్మికులు ధర్నాకు దిగారు. కేంద్రం, రాష్ట్రం పోటీలు పడి ప్రజలను దోచుకుంటున్నాయని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. తెదేపా హయాంలో 500 రూపాయలు ఉన్న గ్యాస్ బండ ధర 900 అయ్యిందన్నారు. నెలకు నిత్యావసర వస్తువుల ధరలు రెట్టింపు పెరిగాయని.. తమ మోటారు వాహనాలను బయటకు తీయాలంటే పెట్రోల్ ధరలను చూసి పేద, మధ్యతరగతి ప్రజలు భయపడుతున్నారని అన్నారు. ప్రజలు భారాలు భరించ లేక పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:
devineni uma released: రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి.. దేవినేని ఉమా విడుదల