తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్టును పార్టీ శ్రేణులు ఖండించాయి. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే సీఎం జగన్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. వైకాపా అవినీతిని ప్రశ్నించినందుకు అరెస్టులు చేయడం దారుణమని యనమల రామకృష్ణుడు దుయ్యబట్టారు. అచ్చెన్నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో కింజరాపు కుటుంబానికి ఉన్న ఆదరణను చూసి జీర్ణించుకోలేక వైకాపా ప్రభుత్వం ఇలాంటి అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
వైకాపా అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడి అరెస్టు ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమని తెదేపా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విమర్శించారు. విజయసాయిరెడ్డి నిమ్మాడ వెళ్లేందుకు అనుమతి ఇస్తే.. తనకు అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. నిమ్మాడలో జరిగిన ఘటనలు డీజీపీకి కనిపించడం లేదా అని వర్లరామయ్య నిలదీశారు. అచ్చెన్నాయుడుని బేషరతుగా 24 గంటల్లో విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: అచ్చెన్నాయుడికి రెండు వారాల రిమాండ్ విధింపు