TDP PATTABHI ON NAME CHANGE OF NTR UNIVERSITY : ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పు.. సీఎం జగన్ కుటిలబుద్ధికి నిదర్శనమని తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభిరాం విమర్శించారు. వైద్య రంగానికి ఎంతో సేవ చేసినట్లు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు వల్లెవేసిన ముఖ్యమంత్రి.. కనీసం ఆసుపత్రుల నిర్వహణకు నిధులు కూడా విడుదల చేయలేదని మండిపడ్డారు. 17 వైద్య కళాశాలలు కడుతున్నామన్న జగన్.. ఒక్కదానికైనా ఇటుక రాయి వేశారా అని ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో ఎన్ని వైద్య కళాశాలలు ఉన్నాయో కూడా జగన్‌కు తెలియదని ఎద్దేవా చేశారు. అంబులెన్సుల కొనుగోళ్లలోనూ అవినీతికి పాల్పడ్డారని ఆక్షేపించారు.
TDP VANGALAPUDI ANITHA : ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్చడంపై అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. తెదేపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వైకాపా అసెంబ్లీలో తీర్మానం చేసిన జీవో కాపీలను దగ్ధం చేశారు. మహనీయుల పేర్లను మార్చడం దారుణమని వంగలపూడి అనిత అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మహనీయులు పేర్లు మార్చిన సంస్కృతి లేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ పేరు పెట్టి తీరుతామని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తుందని.. దీన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
TDP DEVINENI UMA : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును నిరసిస్తూ మాజీ మంత్రి దేవినేని ఉమ అధ్వర్యంలో మైలవరం పంచాయితీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. కూడలి వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి.. అనంతరం పట్టణ పురవీధుల్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అరాచకం రాజ్యమేలుతుందని దేవినేని ఉమ విమర్శించారు. ఇష్టారాజ్య నిర్ణయాలతో ప్రజాగ్రహానికి గురై త్వరలోనే వైకాపా ప్రభుత్వం కనుమరుగవుతుందని దేవినేని జోస్యం చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి ఆ మహనీయుని పేరు యూనివర్సిటీకి పెడతామని ఆయన తెలిపారు.
ఇవీ చదవండి: