సుపరిపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. నరకాసుర పాలన సాగిస్తున్నారని తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ధ్వజమెత్తారు. ప్రజారంజక పాలనకు బదులుగా ప్రజా భక్షక పాలన రాష్ట్రంలో సాగిస్తున్నారని మండిపడ్డారు. దళిత అధికారులపై దాడులు చేసేలా పార్టీ నేతలకు పేటెంట్ ఇచ్చినట్లుగా సీఎం తీరు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ సినిమా థియేటర్‌కి సంబంధించి ఎన్వోసీ ఇవ్వలేదని గుడివాడ తహసీల్దార్‌పై మంత్రి కొడాలి నాని కార్యాలయంలోనే దాడి చేశారని ఆరోపించారు.
విజయవాడ కృష్ణలంక పీఎస్‌లో ఎంపీ నందిగం సురేశ్, అతని అనుచరులు వీరంగం సృష్టిస్తే.. కల్లుండి చూడలేనట్లుగా సీఎం ఉన్నారని ఆక్షేపించారు. రాష్ట్రం నలుమూలలా తమకు సహకరించని అధికారులపై వైకాపా నేతలు దాడులకు దిగుతున్నారన్నారు. దళిత మహిళలపై దాడులు జరిగితే ముఖ్యమంత్రి కనీస చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సహచరులపై దాడులు జరుగుతున్నా.. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పోలీసులున్నారన్నారు.
కాఫీ కొట్టాలంటే వాటిని కొట్టండి..
తెలంగాణలో విఫలమైన జిల్లాల విభజనను జగన్ కాపీ కొట్టాలనుకోవడం తగదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. అంతగా కాపీ కొట్టాలనుకుంటే రైతుబంధు వంటి పథకాలను కాపీ కొట్టాలని సూచించారు. ఆనం రామనారాయణరెడ్డి సహా పలువురు వైకాపా నేతలు జిల్లాల విభజనను తప్పుబడుతున్నారని సోమిరెడ్డి గుర్తు చేశారు. 2026లో దేశవ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల పునర్విభజనతో సరిహద్దుల మారతాయని.., అప్పుడు మళ్లీ జిల్లాలను మారుస్తారా ? అని ప్రశ్నించారు. దేశంలో ఏ శాఖ కూడా పార్లమెంట్ పరిధి ఆధారంగా పరిపాలన జరగదని.., పార్లమెంట్ సరిహద్దులను పక్కనపెట్టి జిల్లాల విభజన చేయాలని డిమాండ్ చేశారు. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, విశాఖ జిల్లాల్లో 124 అసెంబ్లీ స్థానాలున్నాయని.., కడప, నెల్లూరు, ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అసెంబ్లీ స్థానాలు పదిలోపే అని వీటిని విభజించడం తగదని అన్నారు.
జగన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి..
మహిళలకు ద్రోహం చేస్తున్న జగన్ విషయంలో.. కుటుంబ సభ‌్యులు సైతం జాగ్రత్తగా ఉండాలని తెదేపా మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. జగన్ అక్రమాల కారణంగా ఆయన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడే పరిస్థితి ఉందని అనిత అన్నారు. జగన్ చేసిన అవినీతి అక్రమాల్లో సహధర్మచారిని భారతిని బలిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. జగన్ భార్య అయినందుకు ఆమె కోర్టు బోనులో నిలబడే పరిస్థితి వస్తోందన్నారు. అన్న సీఎం అయ్యేందుకు ఎంతో కష్టపడిన జగన్ చెల్లి షర్మిల ప్రాణ రక్షణ కోసం పక్కరాష్ట్రంలో తలదాచుకుంటోందన్నారు. జగన్ అనుమతి లేనిదే సొంత రాష్ట్రంలో అడుగుపెట్టలేని దుస్థితిలో తల్లి విజయమ్మ ఉన్నారన్నారు. వివేకా హత్య కేసులో న్యాయం చేస్తానని మరో చెల్లి సునీతను దారుణంగా మోసగించారని ఆరోపించారు.
ఇదీ చదవండి
కేంద్రం సహకారంతో.. రాష్ట్రంలో రోడ్ల రూపురేఖలు మార్చేస్తాం: జగన్