తప్పుడు కేసులకు తెదేపా భయపడేది లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన గళం వినిపిస్తూనే ఉంటామని తేల్చిచెప్పారు. కర్నూలులో ఒకరు ఎన్440కె రకం వైరస్‌తో మృతిచెందిన వ్యక్తి ఫోటోతో సహా మీడియాలో కథనాలు వచ్చాయని గుర్తు చేశారు. ఎన్440 కె ప్రమాద తీవ్రతను సీసీఎంబీ తన నివేదికల్లో హెచ్చరించిందన్నారు. వారిపై కూడా కేసులు పెడతారా ? అని నిలదీశారు. వ్యాక్సిన్ పంపిణీలో ప్రభుత్వానికి ఓ ప్రణాళిక లేదని విమర్శించారు. 18 నుంచి 45ఏళ్ల మధ్య వయస్సు వారికి రాష్ట్రంలో వ్యాక్సిన్ ఇవ్వలేకపోవటం ప్రభుత్వ వైఫల్యమని దుయ్యబట్టారు. మొదటి డోసు వ్యాక్సిన్ వేయించుకున్న వారికి రెండోడోసు దొరకట్లేదని ఆక్షేపించారు.
'చంద్రబాబుపై కేసు కోర్టు ధిక్కరణే'
తెలుగు దేశం అధినేత చంద్రబాబుపై కేసు కోర్టు ధిక్కరణేనని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావ్ ధ్వజమెత్తారు. సాధారణ పౌరులు కరోనాపై తమ గళాన్ని స్వేచ్ఛగా వినిపించవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎన్ 440కె వైరస్ వ్యాప్తిపై ఈ నెల 4న మీడియాలో వచ్చిన కథనాలనే చంద్రబాబు ప్రస్తావించి అప్రమత్తం చేస్తే తప్పుడు కేసు పెట్టడం దుర్మార్గమన్నారు. ప్రజాసమస్యలపై మాట్లాడిన ధూళిపాళ్ల నరేంద్ర, దేవినేని ఉమలపై కూడా అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు.
ప్రజల్ని అప్రమత్తం చేయటం తప్పా...
కొత్త వైరస్ గురించి ప్రజల్ని అప్రమత్తం చేసి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయటం చంద్రబాబు చేసిన తప్పా? అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు ఆక్షేపించారు. జగన్ రెడ్డి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబుపై అక్రమ కేసు బనాయించారన్నారు. తప్పుడు కేసులతో కరోనా సమాచారన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
'తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికే'
ప్రజల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ..ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టమేంటని చిన రాజప్ప ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమ వైఫల్యాలను కప్పిపెట్టుకోవడానికే చంద్రబాబుపై జగన్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందన్నారు. రాష్ట్రంలో ఏం జరిగినా వైకాపా నేతలు దానిని చంద్రబాబుకి అపాదించాలని చూస్తున్నారని ఆ పార్టీ నేత కొల్లు రవీంద్ర మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు కరోనాతో చనిపోతుంటే ముఖ్యమంత్రి పట్టించుకోకపోగా..తెదేపా నేతల్ని అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుపై కేసులతో జగన్ ప్రజల్ని భయపెట్టాలని చూస్తున్నారని ఆలపాటి రాజా విమర్శించారు. నిర్లక్ష్యం, నిరంకుశత్వం, అహంకారంతో కొట్టుమిట్టాడుతూ చంద్రబాబుని అప్రతిష్టపాలు చేయాలని కుట్ర పన్నారని ఆరోపించారు.
ఇదీచదవండి