అడుగడుగునా పోలీసుల ఆంక్షలు, అడ్డగింతలు, అరెస్టులతో తెదేపా నిజనిర్ధారణ కమిటీ సభ్యుల పర్యటన యత్నం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మాజీ ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వంగలపూడి అనిత, మరికొందరు నేతల్ని బలవంతంగా అరెస్టు చేసేందుకు యత్నించడం, నేతలు, కార్యకర్తల ప్రతిఘటనతో మంగళగిరిలోని తెదేపా కార్యాలయం వద్ద శనివారం ఘర్షణ వాతావరణం నెలకొంది. కొండపల్లిలో మైనింగ్ తవ్వకాలను పరిశీలించేందుకు తెదేపా నిజనిర్ధారణ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వంగలపూడి అనిత.. మంగళగిరిలోని తెదేపా కార్యాలయానికి వెళ్లి అక్కడి నుంచి కొండపల్లి అటవీ ప్రాంతానికి వెళ్లేందుకు ఉద్యుక్తులయ్యారు. పోలీసుల కళ్లుగప్పి విజయవాడ నుంచి మంగళగిరికి ఆర్టీసీ బస్సులో వెళ్లారు. తెదేపా కార్యాలయానికి కొద్ది దూరంలో బస్సు దిగి.. ద్విచక్ర వాహనాలపై కార్యాలయానికి వెళ్లారు. కొండపల్లి వెళ్లేందుకు బయటకు రాగా.. పోలీసులు వారిని అడ్డుకుని, వెళ్లడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. తెదేపా శ్రేణులు, పోలీసులు అక్కడ భారీగా మోహరించడం, నేతలు వెనక్కి తగ్గకపోవడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది.
ప్రశ్నిస్తే అరెస్టులా
పర్యటనను అడ్డగించడంతో రామకృష్ణారెడ్డి, అనిత, మరికొందరు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తామేమీ ఉద్యమానికో.. రోడ్లు, భవనాలు ధ్వంసం చేయడానికో వెళ్లడం లేదని, మైనింగ్ పరిశీలనకే వెళ్తున్నామని చెప్పారు. శాంతిభద్రతల సమస్య సృష్టించొద్దంటూ.. పోలీసులు నిలువరించేందుకు ప్రయత్నించినా వెనక్కి తగ్గలేదు. కొందరు మహిళా నేతలను, రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించగా నేతలు, కార్యకర్తలు అడ్డుకోవడంతో.. ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ప్రశ్నిస్తే అరెస్టులా అంటూ మండిపడ్డారు. సీఎం జగన్ డౌన్.. డౌన్ అంటూ పెద్దయెత్తున నినాదాలు చేశారు. ఈలోపే పోలీసులు ఒక్కొక్కరినీ ఎత్తుకెళ్లి వాహనాల్లోకి ఎక్కించి, అక్కడి నుంచి వివిధ స్టేషన్లకు తరలించారు.
అక్రమం జరగకపోతే అడ్డగింతలెందుకు: నల్లమిల్లి
కొండపల్లి ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరగకపోతే తమను ఎందుకు అడ్డుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే తెదేపా నేతల్ని కొండపల్లికి తీసుకెళ్లి అక్రమాలు జరగలేదని నిరూపించాలని డిమాండ్ చేశారు. ‘అడుగడుగునా పోలీసుల్ని నియమించి ప్రతిపక్షాన్ని అడ్డుకోవడం ప్రభుత్వ నిరంకుశ విధానాలకు నిదర్శనం. జాతీయ హరిత ట్రైబ్యునల్ అక్రమ మైనింగ్‌ను తప్పుపడుతోంది. దీన్ని చూసైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. అక్రమ మైనింగ్ జరగకపోతే తెదేపా నిజనిర్ధారణ బృందం అక్కడికి వెళ్లేందుకు సహకరించాలి’ అని డిమాండ్ చేశారు.
అడ్డుకుని అక్రమాలను అంగీకరించింది: అనిత
తెదేపా నిజనిర్ధారణ కమిటీ కొండపల్లి వెళ్తే ముఖ్యమంత్రి, ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేంటని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. కొండపల్లికి వెళ్లకుండా తమను అడ్డుకున్నారంటే అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లేనని ధ్వజమెత్తారు. ‘కొండపల్లిలో వైకాపా నేతలు మైనింగ్ చేయట్లేదని ప్రభుత్వం చెప్పాలనుకుంటే.. పోలీసుల రక్షణతో మమ్మల్ని అక్కడికి అనుమతించాలి. తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేసేందుకు పోలీసుస్టేషన్‌కు వెళ్లిన దేవినేని ఉమాపైనే తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తారా? ముఖ్యమంత్రికి చట్టం, న్యాయం గురించి తెలియదు. అధికారులూ అలాగే వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారు’ అని హెచ్చరించారు.
ఇదీ చదవండి
Kondapalli: కొండపల్లికి వెళ్లకుండా.. తెదేపా నేతల అరెస్ట్.. బలవంతంగా తరలింపు