రాష్ట్ర ప్రభుత్వంపై తెదేపా సీనియర్ నేత యనమల మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి మంత్రివర్గం పప్పెట్ కేబినెట్ గా మారిందన్నారు. సీఎం తప్ప మిగిలిన వారంతా తోలుబొమ్మల్లా ఎలాంటి అధికారాలు లేకుండా ఉన్నారని విమర్శించారు. అధికారాలన్నీ జగన్ చేతిలో పెట్టుకోవడం.. ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి వ్యతిరేకమన్నారు. జగన్ ముందు నోరు మెదపని మంత్రులు.. బయటికొచ్చి చంద్రబాబుపై ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సజ్జల రామకృష్ణారెడ్డి, వెలుపల విజయసాయిరెడ్డి పెత్తనం చెలాయిస్తున్నారని ఆక్షేపించారు.
ప్రతిదానికీ వారే స్పందిస్తున్నారు
రాష్ట్రంలో ప్రతిదానికీ సలహాదారులే స్పందిస్తూ, మంత్రుల నోళ్లు కట్టేస్తున్నారని మండిపడ్డారు. సజ్జల మాట్లాడుతుంటే వెనుక బొత్స, బుగ్గన, పేర్ని నాని నిలబడటం కంటే దారుణం ఇంకొకటి లేదన్నారు. ఇప్పటికే వ్యవస్థ కుప్పకూలి ఉద్యోగులు ఆందోళన బాట పట్టడంతో.. రాష్ట్రంలో పరిపాలన పడకేసిందన్నారు.
అంబేడ్కర్ పేరు పెట్టకపోవటం దుర్మార్గం
రాష్ట్రాన్ని 26 జిల్లాలు చేస్తూ ఒక్క జిల్లాకు కూడా అంబేడ్కర్ పేరు పెట్టకపోవడం దుర్మార్గమన్నారు. గౌతు లచ్చన్న వంటి ఉద్ధండులు ఎంతోమంది ఉన్నా.. ఒక్క జిల్లాకు కూడా వారి పేరు పెట్టకపోవడం.. జగన్ బీసీ వ్యతిరేక వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు.
"మంత్రులకు కాకుండా పెత్తనమంతా సలహాదారులదే. కీలుబొమ్మ పాలన దేశచరిత్రలో చూడలేదు. అభివృద్ధి, సంక్షేమాన్ని రివర్స్ చేశారు. ఇక మిగిలింది జగన్‌ను రివర్స్ చేయడమే. 26 జిల్లాలు చేస్తూ ఒక్క జిల్లాకు కూడా అంబేడ్కర్ పేరు పెట్టలేదు. గౌతు లచ్చన్న పేరు పెట్టకపోవడం బీసీ వ్యతిరేక నైజానికి నిదర్శనం" - యనమల
ఇదీ చదవండి:
Amul milk project in Ananthapur: అమూల్ వచ్చాక పరిస్థితులన్నీ మారాయి: సీఎం జగన్