Varla Letter to CBI: వైఎస్ వివేక హత్య కేసు నిందితుల ప్రాణాల భద్రత దృష్ట్యా కడప కేంద్ర కారాగార జైలర్ పి. వరుణారెడ్డిని అక్కడ నుంచి బదిలీ చేయాలని సీబీఐ డైరక్టర్‌కు తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. ప్రస్తుతం కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్‌గా ఉన్న వరుణారెడ్డి.. గతంలో అనంతపురం జిల్లా జైలు జైలర్‌గా కూడా పని చేశారని తెలిపారు. ఆయన అనంతపురంలో పని చేస్తున్న సమయంలో పరిటాల రవీంద్ర రాజకీయ హత్యకేసులో ప్రధాన నిందితుడు మొద్దు శ్రీను కూడా అదే జైలులో బందీగా ఉన్నాడన్నారు. ఆ సమయంలో మొద్దు శ్రీనును సహ నిందితుడే సిమెంట్ డంబ్ బెల్‌తో దారుణంగా హతమార్చాడని వర్ల పేర్కొన్నారు. అప్పటి అనంతపురం జిల్లా జైలు జైలర్ వరుణా రెడ్డిపై పలు ఆరోపణలు రావటంతో సస్పెన్షన్‌కు గురయ్యారని వర్ల గుర్తు చేశారు. కడప కేంద్ర కారాగారంలో వరుణారెడ్డిని నియమించడంతో పూర్వాపరాల గురించి తెలిసిన అనేక మంది విస్మయం చెందుతున్నారని వర్ల వెల్లడించారు. వివేకానంద రెడ్డి హత్యకేసులో నిందితులుగా ఉన్న ముగ్గురి ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు వారిని కడప కేంద్ర కారాగారం నుంచి రాజమండ్రికి మార్చాలని, లేదా వరుణారెడ్డిని కడప జైలు నుంచి బదిలీ చేయలని కోరారు.
ఇదీ చదవండి : CBI CHARGE SHEET: వివేకాను అవినాష్ రెడ్డే హత్య చేయించారా?