నేర రాజకీయాలపై పేటెంట్ హక్కులన్నీ వైకాపాకే ఉన్నాయని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. నేర రాజకీయాలపై సజ్జల మాట్లాడటం దెయ్యాలు.. వేదాలు వల్లించడంలా ఉందని మండిపడ్డారు. రాష్ట్రంలో తాలిబన్ ఉగ్రవాదులకు మించిన అరాచకం రాజ్యమేలుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత అవినీతి రాజకీయ నాయకుడిగా జగన్ రికార్డులకెక్కారని.. అలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో నడిచే పార్టీ నేతలు సూక్తులు చెప్పడం హాస్యాస్పదమని ఓ ప్రకటనలో ఎద్దేవా చేశారు.
అసాంఘిక శక్తులకు, నేరమయ రాజకీయాలకు వైకాపా కేరాఫ్ అడ్రస్ అని ధ్వజమెత్తారు. క్విడ్ ప్రోకో, మనీలాండరింగ్ కేసుల్లో సీబీఐ 11, ఈడీ 8 చార్జిషీట్లు.. ఇలా వైకాపా నేతల నేరచరిత్రను అచ్చువేయాలనుకుంటే ఒక గ్రంధం తయారవుతుందని దుయ్యబట్టారు. సజ్జలకు చిత్తశుద్ది ఉంటే జగన్ రెడ్డి.. రూ. 43వేల కోట్ల అవినీతిపై మాట్లాడాలని సవాల్ విసిరారు. షెల్ కంపెనీలు, క్విడ్ ప్రో కో అవినీతిపై ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. ఐదేళ్లలో రూ. వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయన్న కోర్టు ప్రశ్నకు సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి..
CM JAGAN SHIMLA TOUR: సీఎం సిమ్లా టూర్.. ఐదు రోజులు అక్కడే..!