Payyavula on CAG Report: కాగ్ అనుమానాలను రాష్ట్ర ప్రభుత్వం నివృత్తి చేయలేదని తెదేపా నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఆర్థికశాఖ కార్యదర్శి పేరుతో లేని అధికారాన్ని వాడుకున్నారని విమర్శించారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడేళ్లలో వైకాపా పాలనలో మద్యం ఆదాయం రెట్టింపైందని.. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని దాటి అప్పులు చేశారని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
‘‘రూ.48వేల కోట్లకు సంబంధించి రికార్డు సరిగా లేదని కాగ్ చెప్పింది. కాగ్ చెప్పి రెండేళ్లు దాటినా ఆడిటింగ్ నిర్ధారించలేదు. రికార్డు సరిగా లేకుంటే బ్యాంకులు ఊరుకోవని ఆర్థిక మంత్రి బుగ్గన చెబుతున్నారు. కానీ, రూ.వేల కోట్లు ఎటు వెళ్లాయో తెలియడం లేదు. రాష్ట్ర పరిస్థితులపై క్వాలిఫైడ్ ఒపినీయన్‌ను కాగ్ ఇచ్చింది. ఎక్సైజ్ , రిజిస్ట్రేషన్ల ద్వారా పన్ను బాగా పెంచారు. మూడేళ్లలో వైకాపా పాలనలో మద్యం ఆదాయం రెట్టింపైంది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని దాటి అప్పులు చేశారు.
రాష్ట్రంలో ఆదాయం పెరిగిందని మీరే చూపిస్తున్నారు. కానీ, ఉద్యోగులు జీతాలు పెంచమని అడిగితే ఆదాయం లేదని చెబుతున్నారు. అప్పులు తెచ్చి మీరు ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు?. మీరు చేసిన అప్పుల విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం. నీటిపారుదలశాఖకు మేం రూ.60వేల కోట్లు ఖర్చు పెట్టాం. ఈ మూడేళ్లలో మీరు ఎంత ఖర్చు పెట్టారు?. రైతులకు ఎంతో మేలు చేస్తున్నామని బాగా భజన చేస్తున్నారు.
వ్యవసాయశాఖను మూసివేసే దిశగా వైకాపా పాలన ఉంది. రైతు భరోసా తప్ప వ్యవసాయశాఖకు ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదు. భజన కార్యక్రమానికి నిరసనగా విజిల్ బ్లోయర్‌గా మారాం. ప్రజా సమస్యలపై చర్చించే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదని మరోసారి నిరూపితమైంది. ప్రజాధనాన్ని రక్షించే బాధ్యత ప్రతిపక్షంగా మాపై ఉంది.. అందుకే ప్రశ్నిస్తున్నాం’’ అని పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: యూకేలో తెదేపా 40వ వార్షికోత్సవం.. 40కిపైగా నగరాల్లో సంబరాలు!