జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వడం వల్ల ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిని పేద ప్రజలే నష్టపోయారని.. విజయవాడ ఎంపీ కేశినేని నాని ధ్వజమెత్తారు. విజయవాడ ఆటోనగర్‌లో తమకున్న స్థలంలో అగ్నికుల క్షత్రియులు భవన నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.65 లక్షలను నాని కేటాయించారు. నిధులు కేటాయించినందుకు అగ్ని కుల క్షత్రియులు.. కేశినేని నానికి కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి, పరిపాలన విషయంలో చంద్రబాబు తీరును నాని ప్రశంసించారు.
అమరావతి, పోలవరం నిలిచిపోవడంతో ఎంతోమంది కి పనులు దొరకట్లేదని వాపోయారు. విజయవాడలో ఫ్లైఓవర్లు తామే వేశామని సజ్జల చెప్పుకుంటుంటే, కౌంటర్ ఇవ్వటం సమయం వృథా అనిపించిందని ఎంపీ వ్యాఖ్యానించారు. ప్రజలకు సేవ చేసి, అభివృద్ధి చేయడంలోనే చంద్రబాబుకు సంతృప్తి ఉందని స్పష్టంచేశారు. సమాజాన్ని, వ్యవస్థలని నాశనం చేస్తే ఎలాంటి సంతృప్తి ఉండదని మండిపడ్డారు. సమాజాన్ని నాశనం చేసి,తమ కుటుంబం బాగుపడాలని కొందరు కోరుకుంటారని విమర్శించారు. కొన్ని విషయాల్లో గద్దె రామ్మోహన్‌కు తాను ఏకలవ్య శిష్యుడిని అని కేశినేని నాని తెలిపారు.
అగ్నికుల క్షత్రియుల భవనం విషయంలో గద్దె రామ్మోహన్ కృషి ఉందన్నారు. విజయవాడ పశ్చిమ సెగ్మెంటులో నగారాల సామాజిక వర్గం వాళ్లు కమ్యూనిటీ హాల్ లేదని, అవసరమైన నిధులు ఇస్తానంటే,4 కోట్లు ఇస్తానని వెలంపల్లి హామీ ఇచ్చి విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్నికుల క్షత్రియుల భవన నిర్మాణం వల్ల కేవలం కృష్ణా, విజయవాడల్లో ఉన్న వారే కాకుండా, రాష్ట్రంలోని అగ్నికుల క్షత్రియులంతా కేశినేని నానిని గుర్తుంచుకుంటారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర తెలిపారు.
మత్స్యకారులకు అండగా ఉంటోంది తెదేపానే అని, వైకాపా ఇప్పుడేదో మాయ మాటలు చెబుతోందని మండిపడ్డారు. వలలు, పడవలు లేకుండా మత్స్యకార భరోసా పేరుతో వైకాపా మభ్యపెడుతోందన్నారు.
ఇవీ చూడండి: