శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం గడ్డిముడిదాంలో.. వైకాపా కార్యకర్తలు సంక్షేమ పథకాల అమలులో చూపుతున్న వివక్షకు సీఎం సమాధానం చెప్పాలని.. తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు(Atchannaidu) డిమాండ్ చేశారు. చేయూత అమలులో వాలంటీర్ల వివక్ష దుర్మార్గమని ధ్వజమెత్తారు. వైకాపాకు ఓటు వేయలేదనే అక్కసుతో.. వాలంటీర్ల వేధింపులకు నిరసనగా.. గడ్డిముడిదాంలో మహిళలు సచివాలయం ముట్టడించారన్నారు. వారి పట్ల చూపిన వివక్షకు ముఖ్యమంత్రి బాధ్యత వహించి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
పథకాలు నిలిపివేయటం దుర్మార్గమన్నారు
సీఎం జగన్ రెడ్డి ప్రతిపక్షాలపై దాడులు చేస్తుంటే, వాలంటీర్ల రూపంలో వైకాపా కార్యకర్తలు ప్రజలపై కక్ష సాధిస్తున్నారని దుయ్యబట్టారు. వాలంటీర్లు ఓటేయలేదని.. పథకాలు నిలిపేయటం దుర్మార్గమన్నారు. చేయూత పథకంలో ప్రతి మహిళకు పింఛన్ ఇస్తాననే మాట తప్పారని అచ్చెన్నాయుడు విమర్శించారు.
అధికారం కోసమే హామీలు
మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని.. వైకాపా ప్రభుత్వం అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఓ బూటకమని రుజువైందన్నారు. అధికారం కోసమే జగన్ రెడ్డి హామీలిచ్చారని విమర్శలు చేశారు. రూ.3వేల పింఛన్ అమలులో మోసగించి, కుల ధ్రువీకరణ పేరుతో వేధించారని మండిపడ్డారు. హామీలన్నీ అధికారం కోసమే తప్ప, ప్రజల కోసం కాదని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: