TDP followers agitation on OTS: వన్‌టైమ్ సెటిల్మెంట్ (OTS) పథకాన్ని వ్యతిరేకిస్తూ.. రాష్ట్రంలో పలు చోట్ల తెలుగుదేశం ఆధ్వర్యంలో నిరససలు చేపట్టారు. ఓటీఎస్ కు వ్యతిరేకంగా.. శ్రీకాకుళం ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. నరసన్నపేటలో మాజీ ఎమ్మెల్యే రమణమూర్తి ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. విజయనగరం, పార్వతీపురంలో.. అధికారులకు వినతిపత్రం అందజేశారు. పెందుర్తిలో నాలుగు రోడ్ల కూడలి నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి.. మండల పరిషత్ కార్యాలయాల ఎదుట ఓటీఎస్ ను ఉపసంహరించుకోవాలంటూ ధర్నా నిర్వహించారు.
బాధితుల పక్షాన పోరాటం చేస్తాం: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
ఓటీఎస్ (OTS)ను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం పింఛన్లు తొలగిస్తే.. బాధితుల పక్షాన పోరాటం చేస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. పటమట ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నాలో ఆయన పాల్గొన్నారు. కృష్ణాజిల్లా పెనమలూరు ఎంపీడీవోకు.. మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, కొనకళ్ల నారాయణ వినతిపత్రం అందజేశారు. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట తెదేపా శ్రేణులు నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో.. ర్యాలీగా వెళ్లి ఎంపీడీవోలకు వినతిపత్రాలు అందజేశారు. చీరాలలో గడియార స్తంభం కూడలి నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
నెల్లూరు, తిరుపతిలో ఆందోళన..
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో.. తెదేపా కార్యాలయం నుంచి మండల పరిషత్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా తిరుపతిలో తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. ఓటీఎస్ పథకం పేదలకు గుదిబండగా మారిందని.. కుప్పం తెదేపా శ్రేణులు ఆందోళన చేశాయి. చంద్రగిరిలో టవర్ క్లాక్ నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతపురం జిల్లా కదిరి మున్సిపల్ కార్యాలయం ఎదుట.. తేదేపా శ్రేణులు ఆందోళన చేశాయి. పెనుకొండ నియోజకవర్గంలో ఎంపీడీవో కార్యాలయాల ఎదుట బైఠాయించారు.
ఇదీ చదవండి:
AP Govt On DA: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ విడుదల చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు