TDP BC LEADERS MEETING: బీసీలను ఏకం చేసేలా ప్రత్యేక అధ్యయన కమిటీలు ఏర్పాటు చేయాలని తెదేపా సీనియర్ బీసీ నేతలు తీర్మానించారు. బీసీ జనగణనపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎన్టీఆర్ భవన్లో బీసీ నేతలు సమావేశం నిర్వహించారు. గత 40ఏళ్లుగా బీసీలు తెలుగుదేశంతోనే ఉన్నారనీ.. వారి ఐక్యత, సంక్షేమం, అభ్యున్నతి తెలుగుదేశంతోనే సాధ్యమని నేతలు స్పష్టం చేశారు. నాయకత్వ గుర్తింపు కోసం త్వరలోనే క్షేత్రస్థాయి అధ్యయనం చేపట్టాలని నిర్ణయించారు.
ఎన్నికల్లో గెలుపు కోసం బీసీలకు మోసపూరిత హామీలు ఇచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చాక ఐక్యంగా ఉన్న బలహీనవర్గాల మధ్య చిచ్చుపెట్టారని మండిపడ్డారు. కార్పొరేషన్ల పేరుతో కులాల మధ్య విభేదాలు సృష్టిస్తున్న.. జగన్ రెడ్డి కుట్రలను బీసీలు ఐక్యమై ఛేదించాలని తీర్మానించారు.
తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పిస్తే.. జగన్ రెడ్డి తన స్వలాభం కోసం వాటిని 24శాతానికి కుదించి 16,800 పదవులు దూరం చేశారని నేతలు దుయ్యబట్టారు. విదేశీ విద్య, బీసీ భవనాలు, పూలే స్టడీ సర్కిల్స్, కార్పొరేషన్, ఫెడరేషన్ల రుణాలు దూరం చేశారని మండిపడ్డారు.
సలహాదారులు, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు కనీస ప్రాధాన్యం ఇవ్వకపోగా.. వైకాపా నేతల అవినీతి, అక్రమాలపై ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆక్షేపించారు. నిధులు, విధులు లేని కార్పొరేషన్లతో బీసీలకు ద్రోహం చేస్తున్న జగన్ రెడ్డిపై ఐక్యంగా ఉద్యమించాలని నిర్ణయించారు. సమావేశంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు, సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, కిమిడి కళా వెంకట్రావు, కాలవ శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి...
Chandrababu Kuppam Tour: తెదేపా కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ఏ ఒక్కరినీ వదిలిపెట్టను: చంద్రబాబు