రోజురోజుకు పెరుగుతున్న ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. నిత్యావసర ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ముఖ్యంగా హోటళ్లు నడిపే వారికి ఇది మరింత భారంగా మారింది. ఎన్నడూ లేని విధంగా వాణిజ్య గ్యాస్ ధర... కొన్ని నెలల్లోనే రూ. 2 వేలకుపైగా పెరిగింది. దీని ప్రభావం హోటల్స్పై పడుతోంది. వీటితోపాటు నిత్యావసర ధరలు కూడా పెరిగి.. ధరలకు కళ్లెం లేకుండాపోయింది.
చేసేదేమీ లేక భోజనాలు, అల్పాహార ధరలు పెంచేశారు. ఈ ధరల పెంపు ప్రభావం ఎక్కువగా యువకులు, వలస కూలీలు, ఉద్యోగులపై పడుతోంది. దీంతో సామాన్య ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏం కొనేట్టు లేదు.. ఏం తినేట్టు లేదు అని ప్రజలు అంటున్నారు. ప్రతిరోజూ కడుపు నిండా తినే మేమూ.. ధరల పెరగటంతో ఆకలితో సర్దుకోవాల్సి వస్తుందని వినియోగదారులు వాపోతున్నారు.
అవే మా పాలిట శాపంలా మారాయి: గతంతో పోలిస్తే 40 శాతం ధరలు పెరుగుదలతో అధిక భారం పడుతుందని హోటల్ యజమానులు చెబుతున్నారు. ముఖ్యంగా వంట గ్యాస్, నిత్యావసరాల రేట్లు తమ పాలిట శాపంలా మారాయని అవేదన వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారులతో కిటకిటలాడాల్సిన హోటళ్లు.. జనం లేక వెలవెలబోతున్నాయంటున్నారు. 30 శాతం వ్యాపారం తగ్గిపోయిందని పేర్కొన్నారు. వ్యాపారాలు నడపలేక ఇబ్బందులు పడుతున్నామని.. సిబ్బందికి జీతాలు, నిర్వహణ చేయలేకపోతున్నామని అంటున్నారు.
ధరలపై నియంత్రణ ఉండాలి: ధరల పెరుగుదలపై నియంత్రణ అవసరమని వినియోగదారులు అంటున్నారు. సామాన్యులు పరిస్థితి దారుణంగా ఉందని.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే తక్కువ ధరలో ప్రజలకు నిత్యావసర సరకులు అందించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: ఆట ఆడాలంటే.. డబ్బు కట్టాల్సిందే.. రాష్ట్ర సర్కారు కొత్త రూల్..!