పండుగ రోజే గుంటూరు జిల్లాలోని భ్రమరాంబ ఆలయంలో చోరీ జరగడం దురదృష్టకరమని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఈ ఘటన అద్దం పడుతోందని లేఖలో విమర్శించారు. రాజకీయ ప్రోద్బలంతో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని సీఎం జగన్, కుట్రకోణం లేదని డీజీపీ.. చెప్పే విధానాన్ని చూస్తే ప్రజలకు అనుమానం కలుగుతోందన్నారు. వైకాపా ప్రభుత్వానికి పోయే కాలం దగ్గరపడి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆలయాలపై దాడులు చేసిన నేరస్థులను పట్టుకోకుండా, పంచెకట్టుతో దేవాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేసినంత మాత్రాన.. సీఎం జగన్ హిందూ మత పరిరక్షకులు కాలేరని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు.
దేవుళ్లకే రక్షణ లేని పాలనలో ప్రజల ఎలా ఉంటుందని నిలదీశారు. దేవాలయాలపై దాడులు చేసిన 347 మందిని అరెస్టు చేశామంటున్న డీజీపీ.. దోషులను ప్రజల ముందు ఎందుకు నిలబెట్టలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, డీజీపీ నివాసముంటున్న ప్రాంతాల్లోనే ఆలయాలకు రక్షణ లేదంటే.. ఇతర ప్రాంతాల్లో పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలన్నారు. రానున్న కాలంలో పాఠశాలలపైనా ఏ విధంగా దాడులు చేయాలో ప్రణాళికను సిద్ధం చేస్తారని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి:
'బర్డ్ ఫ్లూ మనుషులకు సోకే అవకాశం లేదు... కోడి మాంసం, గుడ్లు తినొచ్చు'