రాష్ట్రంలోని పరిస్థితుల దృష్ట్యా రిజర్వుడ్ పోలీసులను స్థానిక ఎన్నికల్లో వినియోగిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో అధికారులతో గురువారం ఆయన సమావేశమయ్యారు. అనంతరం ఎన్నికల సన్నద్ధతపై వివరాలు వెల్లడించారు. రెండు రోజులుగా వివిధ శాఖల అధికారులతో సమావేశాలు జరుపుతున్నామని... ఎన్నికలు జరిపే స్వరూపాన్ని అధికారులతో చర్చించామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టం చేశామన్న ఆయన.. శుక్రవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం ఉంటుందన్నారు. ఈ భేటీ తర్వాత నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు. నోటిఫికేషన్తో పాటే ఎన్నికల ప్రవర్తనా నియమావళి కూడా అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీపై ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించడాన్ని కమిషనర్ స్వాగతించారు. ముందుగా ఏ ఎన్నికలు నిర్వహించాలనే దానిపై శుక్రవారం ఓ స్పష్టత వస్తుందని తెలిపారు.
ఇదీ చదవండి: