పవిత్ర రంజాన్ మాసంలో పేదలకు దానం చేసేందుకు ముస్లిం దాతలు నిర్దిష్ట వేళల్లో బయటకు రావచ్చని, అందుకు ప్రభుత్వం అనుమతినిచ్చిందని వక్ఫ్‌బోర్డు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. వ్యక్తిగత దూరం పాటిస్తూ తెల్లవారుజామున 3 నుంచి 4:30 గంటల వరకు, సాయంత్రం 5:30 నుంచి 6:30 గంటల వరకు బయటకు వచ్చి దానం చేయవచ్చని పేర్కొంది. సాయంత్రం ఇఫ్తార్ సమయానికి పండ్లు, డ్రై ఫ్రూట్స్ అమ్మకానికి అనుమతిిచ్చి, అవి ముస్లింలకు అందుబాటులో ఉండేలా చూడాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్టు బోర్డు తెలిపింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుంటారని వెల్లడించింది. రంజాన్ సందర్భంగా ప్రభుత్వం కల్పించే ఇతర వెసులుబాట్లను వక్ఫ్ బోర్డు ఆ ప్రకటనలో పేర్కొంది.
నగరాల్లోని కొన్ని హోటళ్లను గుర్తించి సహరి, ఇఫ్తార్ సమయాల్లో భోజనం, ఇతర తినుబండారాలు అందుబాటులో ఉండేలా చూడాలి.
క్వారంటైన్‌లో ఉన్న ముస్లింలకు సహరి, ఇఫ్తార్ సమయాల్లో వ్యాధి నిరోధక శక్తి పెంచే ఆహారాన్ని అందించాలి.
5 పూటల నమాజు చదివేందుకు వీలుగా ఇమామ్, మౌజమ్, మరో ముగ్గురికి ఇంటి నుంచి మసీదుకు వెళ్లేందుకు అనుమతివ్వాలి.
కూరగాయలు, పండ్లు, మిగతా అన్ని నిత్యావసర సరకులు ఉదయం 10 గంటల వరకు అందుబాటులో ఉంచాలి.
ఈ వివరాలను ప్రతి మసీదు ఆవరణలో ప్రదర్శించాలి.
ఇదీ చూడండి: 'ముస్లిం సోదరులు రంజాన్‌ను ఇంట్లోనే చేసుకోండి'