దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఓ నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. మూడు వేర్వేరు గమ్యాలకు నాలుగు అతి పొడవైన రైళ్లను విజయవంతంగా నడిపించింది. విజయవాడ డివిజన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వినూత్న విధానానికి పవిత్ర మూడు నదుల సంగమంగా భావించే ‘త్రివేణి’ అని పేరు పెట్టారు. ఒకే రోజు ఒకేసారి మూడు వేర్వేరు గమ్యస్థానాలకు నాలుగు అతి పొడవాటి రైళ్లను నడిపించారు. ప్రతి పొడవాటి భారీ రైలులో రెండు గూడ్స్ రైళ్లు జతచేశారు. సాధారణ సరుకు రవాణా రైళ్ల కంటే రెండింతలు పొడవుగా ఉన్నాయి. మొత్తం నాలుగు భారీ రైళ్లలో, రెండు రైళ్లు ఒక్కొక్క దానిలో 118 ఓపెన్ వ్యాగన్లు చొప్పున సరకు కలిగి విజయవాడ నుం విశాఖపట్నం వైపు తాల్చేర్ వరకు సుమారు 900 కిలోమీటర్లు ప్రయాణించాయి.మరో పొడవాటి రైలు రెండు ఓపెన్ వ్యాగన్ రైళ్లతో అదాని కృష్ణపట్నం పోర్టు నుండి ఓబులవారిపల్లి మీదుగా 645 కిమీల దూరం గల కేసోరామ్ సిమెంట్‌కు రవాణా అయ్యింది.
మూడో దిశలో విజయవాడ నుంచి కొండపల్లి వరకు బిసిఎన్ రేక్స్ కలిగిన రెండు రైళ్ల కవర్డ్ వ్యాగన్లను జతపరిచి రవాణా చేశారు. ఈ వినూత్న పద్దతి గూడ్స్ రైళ్ల నిర్వహణలో వేగాన్ని పెంచడం, గమ్య స్థానాలకు తక్కువ సమయంలో లోడింగ్ లేదా అన్‌లోడింగ్ చేయడం, వ్యాగన్ రాకపోకల సమయం తగ్గించడం వల్ల సరుకు రవాణా లోడింగ్ అభివృద్ధికి తోడ్పడుతుందని అధికారులు తెలిపారు. సిబ్బంది అవసరం తగ్గడం సహా రైళ్ల రద్దీ ప్రాంతాలలో ఇతర రైళ్ల నిర్వహణలో వినియోగించుకోవడం సహా పలు ప్రయోజనాలు ఉన్నట్లు తెలిపారు. వినూత్న పద్దతిలో సరుకు రవాణా రైళ్ల నిర్వహణను చేపట్టి సరుకు రవాణా సామర్ధ్యం పెంపొందుకు కృషి చేస్తున్న విజయవాడ డివిజన్ అధికారులను, సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య ప్రత్యేకంగా అభినందించారు.
ఇదీ చదవండి: cm jagan: గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి సీఎం జగన్