Separate Accounts For Grama Panchayats Funds: గ్రామ పంచాయితీల నిధులను సర్కారు మళ్లిస్తోందంటూ.. సర్పంచులంతా ఇటీవల చేపట్టిన ఆందోళనకు రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి ప్రత్యేక బ్యాంకు ఖాతాలను తెరవాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా.. ఏపీ లీడ్ బ్యాంకు 'యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా'కు సూచిస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ లేఖ రాసింది.
Centre On 15th Finance Commission Funds: ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీలకే ఇస్తామంటూ కేంద్రం తేల్చి చెప్పటంతో.. అనివార్యంగా దిగివచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. పంచాయతీలను నేరుగా డబ్బలు జమ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలను తెరవాల్సిందిగా జిల్లా, మండల, పరిషత్లతోపాటు గ్రామ పంచాయతీలకూ సూచనలు జారీ చేసింది. పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా మాత్రమే ఈ నిధులు వినియోగించుకోవాల్సిందిగా కేంద్రం స్పష్టం చేసింది.
సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ల వినియోగానికి పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం అవసరమవుతుందని ప్రభుత్వం పేర్కొంది. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ లు, జిల్లా పరిషత్ ల మధ్య సమన్వయం కోసం.. ఇ-గ్రామస్వరాజ్ ద్వారా పీఎఫ్ఎంఎస్ విధానం అమలు చేయనున్నట్టు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ తెలియచేసింది.
Public Financial Management System: గ్రామ పంచాయతీలకు 15 ఆర్థిక సంఘం నిధుల మంజూరుకు పీఎఫ్ఎంఎస్ను తప్పనిసరి చేయండంతోనే ఈ ప్రత్యేక ఖాతాలు అవసరం అవుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటి వరకూ సీఎఫ్ఎంస్ ద్వారా నిధులకు సంబంధించిన వ్యవహారాన్ని నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇక నుంచి కేంద్రం నిర్దేశించిన పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టం (పీఎఫ్ఎంఎస్ ) ద్వారా మాత్రమే నిధులను వినియోగించాల్సి ఉంది.
నిధుల నిర్వహణకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో.. ప్రత్యేక ఖాతాలను తెరవాల్సిందిగా జిల్లా, మండల పరిషత్ లు, గ్రామ పంచాయితీలకు ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. ఖాతాలను తెరిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా యూబీఐ బ్రాంచీల వివరాలను తెలియజేయాల్సిందిగా.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీజీఎంకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ లేఖ రాశారు. మరోవైపు ఖాతాల్లోని నిధుల లావాదేవీలకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ప్రభుత్వం.. యూబీఐని కోరింది. 15 ఆర్థిక సంఘం నిధులకు సంబంధించిన ఖాతాల్లో ఎలాంటి డిపాజిట్లకూ ఆస్కారం లేకుండా చూడాలని స్పష్టం చేసింది. ఆర్థిక సంఘం నిధుల్ని ఇ-గ్రామస్వరాజ్ పీఎఫ్ఎంఎస్ ద్వారా మాత్రమే తీసుకునేలా చూడాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.
ఇదీ చదవండి