Special Buses In AP For Dussehra : దసరా పండుగ రద్దీ దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలకు 4వేల 500 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 7 వరకు ఈ బస్సులు నడపనున్నట్లు చెప్పారు. ప్రత్యేక బస్సుల్లో అదనంగా 50 శాతం ఛార్జీలు వసూలు చేయకూడదని నిర్ణయించినట్లు తెలిపారు. సాధారణ రోజుల్లో వసూలు చేసే ఛార్జీలనే ప్రత్యేక బస్సుల్లో వసూలు చేయనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలకు అదనంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని.. ఈ బస్సుల్లో ముందస్తు టికెట్ రిజర్వేషన్ చేసుకునే సదుపాయం ఉందన్నారు.
ప్రయోగాత్మకంగా సరికొత్త విధానంలో ఈ సారి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్న ఎండీ.. మంచి ఫలితాలు వస్తే కొనసాగిస్తామని.. లేదంటే పాత విధానం అమలు వైపు ఆలోచిస్తామన్నారు. ప్రయాణికుల ఫిర్యాదులు, సలహాల కోసం 24 గంటల కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు 0866-2570005 నెంబర్కు ఫోన్ చేసి తమ సమస్యలు తెలియజేయవచ్చన్నారు.
దసరా నాటికి 'స్టార్ లైనర్' పేరిట నాన్ ఎసీ స్లీపర్ సర్వీసులను ప్రారంభిస్తామన్నారు. దశలవారీగా మొత్తం 62 స్టార్ లైనర్ బస్సుల్ని రోడ్డెక్కిస్తామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు అక్టోబర్ 1న పీఆర్సీ మేరకు పెంచిన వేతనాలు ఇవ్వనున్నట్లు ఎండీ తెలిపారు. పదోన్నతులు పొందిన 2వేల ఉద్యోగులకు అక్టోబర్లో పాత వేతనాలే ఇస్తామని.. ఆమోదం అనంతరమే పెంచిన వేతనాలు ఇవ్వనున్నట్లు ఎండీ స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: