అభివృద్ధి ఒకేచోట కేంద్రీకృతమైన ప్రాంతాలు.. గతంలో ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. అలా ఉంటే..ప్రాంతీయ అసమానతలు తలెత్తుతాయన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో..గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం..3 రాజధానుల అవసరం ఉందని వివరించారు. పాలన రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి.., న్యాయరాజధానిగా కర్నూలును చేయాలని ప్రభుత్వం భావిస్తోందని స్పష్టం చేశారు. వికేంద్రీకరణ కీలకమైన అంశంగా ప్రభుత్వం భావిస్తోందని గవర్నర్ వివరించారు.
ఒకే ప్రదేశంలో అభివృద్ధిని కేంద్రీకరిస్తే.... అస్థిరత, ప్రాంతీయ అసమతుల్యతకు దారితీస్తుందని గతం చెబుతోంది. వికేంద్రీకరణ ద్వారా.... విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇలా చేస్తే.... అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి దోహదపడుతుందని ప్రభుత్వ అభిప్రాయం. ఫలితంగా.... విద్య, వైద్యారోగ్య, సాగు, సంక్షేమ పథకాలను అన్ని వర్గాల ప్రజలకూ చేరవేసేందుకు సులువు అవుతుంది. - బిశ్వభూషణ్ హరిచందన్, గవర్నర్
రాష్ట్రంలో ఇటీవల శాంతి భద్రతల్ని దెబ్బతీసేలా కొన్ని ఘటనలు జరిగాయని గవర్నర్ వ్యాఖ్యానించారు. కుట్రలు సఫలీకృతం కాకుండా ప్రభుత్వం అడ్డుకోగలిగిందన్నారు.
అందరి విశ్వాసాలను గౌరవించడం మన సంప్రదాయం. ఇటీవల జరిగిన కొన్ని రాజ్యాంగ విరుద్ధ ఘటనలు బాధించాయి. భిన్నత్వంలో ఏకత్వం అనే సూత్రాన్ని ప్రతిబింబించే ఐక్యతను కాపాడేందుకు...ప్రభుత్వం నిత్యం కృషి చేస్తోంది. స్వార్థ ప్రయోజనాల కోసం...కొన్ని శక్తులు అర్థరహిత, అవాంఛనీయ ఘటనలను ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తున్నాయి. మన సమాజంలో అపవిత్రత, విధ్వంసాలు, కాల్పులకు స్థానం లేదు. అలాంటి చర్యలకు పాల్పడేవారిపై...శాంతిభద్రతల పరిరక్షించే క్రమంలో కఠిన చర్యలు తీసుకోక తప్పదు. - బిశ్వభూషణ్ హరిచందన్, గవర్నర్
వేడుకల్లో సుదీర్ఘంగా ప్రసంగించిన గవర్నర్ బిశ్వభూషణ్...ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని స్పష్టం చేశారు.
పేదలకు ఇళ్ల పథకానికి రూ.28,084 కోట్లు వెచ్చించాం. రూ.23,535 కోట్ల విలువైన భూములను పేదలకు అందించాం. 7.93 కోట్ల మందికి రూ.94,877 కోట్లతో సంక్షేమ పథకాలు ఇచ్చాం.. రైతు భరోసా కింద రూ.13,101 కోట్లు అందించాం. రైతుల సౌలభ్యం కోసం 10,641 ఆర్బీకేలు ఏర్పాటు చేశాం. - బిశ్వభూషణ్ హరిచందన్, గవర్నర్
ఇదీ చదవండి: జంట హత్యలు... అల్లుకున్న చిక్కుముళ్లు