Coal hardships by summer: బొగ్గు కొరతతో థర్మల్ యూనిట్లను జెన్‌కో బ్యాక్ డౌన్ చేసింది. నవంబరు తొలి వారంలో రోజుకు 68 మిలియన్ యూనిట్లుగా ఉన్న థర్మల్ విద్యుత్ ఉత్పత్తి నెలాఖరుకు 47 ఎంయూలకు తగ్గింది. మరోపక్క, ఇటీవలి వరకు 140-142 ఎంయూలుగా ఉన్న విద్యుత్ డిమాండ్ క్రమేణా పెరుగుతూ 155 ఎంయూలకు చేరింది. దీన్ని సర్దుబాటు చేసేందుకు బహిరంగ మార్కెట్‌లో రోజుకు సుమారు 10-12 ఎంయూల విద్యుత్ కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కొన్నేళ్లుగా విద్యుత్ వినియోగాన్ని బట్టి వేసవిలో డిమాండ్ రోజుకు 220-230 ఎంయూల వరకు ఉంటుందని అంచనా.
ఇంత డిమాండ్‌ను సర్దుబాటు చేసేందుకు థర్మల్ యూనిట్ల వద్ద కనీసం 15-16 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉంచుకోవాలి. అక్టోబరు-నవంబరు నుంచే క్రమేణా నిల్వలు పెంచుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. దేశవ్యాప్తంగా కొరత ఏర్పడటంతో సరఫరా చేసుకుంటున్న బొగ్గు రోజు వారీ ఉత్పత్తికే సరిపోవడం లేదు. అప్పట్లో బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ రేట్లు భారీగా పెరగటంతో జెన్‌కో థర్మల్ ప్లాంట్లను పూర్తి స్థాయిలో వినియోగించింది. ఆ ప్రభావం ఇప్పుడు పడింది. ప్రస్తుతం జెన్‌కో థర్మల్ కేంద్రాల్లో కేవలం 1.85 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. వీటితో పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి చేయలేని పరిస్థితి. డిసెంబరు, జనవరి నెలల్లో కనీసం వారం రోజులకు సరిపడేలా 7-9 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు లేకుంటే వేసవిలో పెరిగే డిమాండ్‌ను తీర్చడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత సరఫరా తీరును బట్టి నిల్వలు పెంచుకోవటం కూడా కష్టమని అభిప్రాయపడుతున్నారు.
* ప్లాంట్ల నిర్వహణకు అవసరమైన బొగ్గు నిల్వలు లేకపోవటంతో కడపలోని రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఒక్కోటి 210 మెగావాట్ల సామర్థ్యం ఉన్న నాలుగు యూనిట్లు, కృష్ణపట్నంలో 800 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఒక యూనిట్‌ను జెన్‌కో నిలిపేసింది. విజయవాడలోని వీటీపీఎస్‌లో మాత్రమే అన్ని యూనిట్ల నుంచి ఉత్పత్తి జరుగుతోంది. ఇక్కడ ప్రస్తుతం 92 వేల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి.
* శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం ప్రస్తుతం 867.5 అడుగులకు చేరగా, 136 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. ఇందులో సుమారు 40 టీఎంసీలను విద్యుత్ ఉత్పత్తికి వాడుకోవచ్చు. ఏపీ వాటా కింద సుమారు 25 టీఎంసీలు వచ్చే అవకాశం ఉందని, అత్యవసర పరిస్థితుల్లో ఇక్కడ వారం పాటు విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: 'మగధీర' పాటకు 22 రోజులు.. 'అరుంధతి' సాంగ్‌కు 32 రోజులు